Sanitation Works Speedup in Vijayawada Flood Areas: విజయవాడలో వరద అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో అనేక కాలనీల్లో వరద ప్రభావం తగ్గడంతో పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించింది. మురుగు కాలువల్లో చేరిన పూడికను తొలగించడంతో పాటు వరద ప్రభావంతో రోడ్లపైకి కొట్టుకొచ్చిన ఇసుక, మట్టిని తొలగిస్తున్నారు. దీంతో పాటు ఇళ్లల్లోకి చేరిన మురుగునీ ఫైరింజన్ల ద్వారా తొలగిస్తున్నారు. ఈ రోజు సింగ్ నగర్ ప్రాంతంలో మరింత వరద తగ్గే అవకాశం ఉంది. వరద తగ్గితే సహాయ కార్యక్రమాలు మరింత వేగవంతమవ్వనున్నాయి. వరద ప్రాంతాల్లో పారిశుధ్య పనుల కోసం రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, నగర పంచాయితీల నుంచి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు వచ్చారు.
Bleaching Spraying Through Drones in Vijayawada: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఇప్పటికే విజయవాడలో డ్రోన్లను ఉపయోగించి అనేక మందికి ఆహారం అందజేశారు. ఇక ఇప్పుడు డ్రోన్లను పారిశుద్ధ్య పనులకు కూడా ఉపయోగిస్తున్నారు. బ్లీచింగ్ వంటి క్రిమిసంహారక మందులను డ్రోన్ల ద్వారా పిచికారి చేస్తున్నారు. వందల మంది కార్మికులు చేసే పనిని, డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో చేయగలుగుతున్నారు.
వరదలు తగ్గిన తరువాత దోమల వ్యాప్తి లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీంతో పాటు వరద ప్రాంతాల్లో దుర్వాసన రాకుండా ఈ ద్రావణం పిచికారి ఎంతో ఉపయోగపడుతుంది. బ్లీచింగ్, హైడ్రోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేయడం ద్వారా వరదలు తగ్గిన తరువాత అంటువ్యాధులు, రోగాలు రాకుండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.