Rythu Bheema and Rythu Bandhu Scam Updates : తెలంగాణలో సంచలనం సృష్టించిన రైతు బీమా, రైతుబంధు కుంభకోణం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దాదాపుగా రెండు కోట్ల రూపాయల నిధులను అక్రమంగా దారి మళ్లించిన వ్యవసాయ విస్తరణాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం అగిర్యాల్ క్లస్టర్‌లో ఏఈవోగా విధులు నిర్వహిస్తున్న గోరేటి శ్రీశైలం, తన మిత్రుడు, క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓదెల వీరస్వామితో కలిసి దాదాపుగా రెండుకోట్ల రూపాయలు రైతుబంధు, రైతుబీమా నిధులు స్వాహా చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వెలుగులోకి మరో కుంభకోణం - రైతు బీమా, రైతుబంధులోనూ గోల్మాల్ - రూ.2 కోట్లు స్వాహా
ప్రభుత్వం రైతులు అకాలమరణం చెందితే ఇచ్చే బీమా డబ్బులను కోటి రూపాయల మేర కాజేశాడు. ఇందుకోసం 20 మంది పేరిట రైతుబీమా కోసం నకిలీ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నకిలీ పత్రాలు(Fake Documents) అచ్చం ఒరిజినల్ వాటిని పోలి ఉండేలా చూసుకున్నారని పోలీసులు వెల్లడించారు. బతికి ఉన్నవారివే చనిపోయినట్లుగా కొన్ని, 18 నుంచి 59 ఏళ్ల లోపు వర్తించే పథకంలో 60 ఏళ్లు దాటిన వారికి కూడా ఆధార్లో పుట్టినతేది మార్చడం లాంటివి చేసి సొమ్ము చేసుకున్నాడు.
క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల నుంచి వచ్చిన వివరాలే కదా అని కాస్త ఎమరపాటుగా ఉండడంతో డబ్బులు దారి మళ్లినట్లు పోలీసులు తెలిపారు. కాగా రైతు బీమా డబ్బులు పదే పదే అదే ఖాతాలోకి వెల్లినట్లు గమనించిన ఎల్‌ఐసీ అధికారులు పోలీసులకు, జిల్లా వ్యవసాయాధికారికి(Agriculture Officer) విషయం చేరవేశారు. డీఎఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
"కొందుర్గు మండలానికి చెందిన రైతు బంధు, రైతు బీమా నిధులు దారిమళ్లాయి. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలతో రైతు బీమా, రైతుబంధు పేరిట నిధుల మళ్లింపు జరిగింది. నిందితుడు తన మిత్రుడితో 7 బ్యాంకు ఖాతాలు తెరిపించాడు. వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీశైలం రూ.కోటి కొట్టేశాడు." -అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీ