ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవును అవి ఆర్టీసీ బస్సులే!- ప్రయాణమంటేనే భయపడుతున్న ప్రజలు - YSRCP Govt Neglect APSRTC - YSRCP GOVT NEGLECT APSRTC

YSRCP Govt Neglect APSRTC : సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు చిరునామా అంటారు! కానీ వైఎస్సార్సీపీ విధ్వంస పాలనతో ఆర్టీసీ ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఐదేళ్లుగా మరమ్మతులు లేక అధ్వానమైన రూపం, అద్దాలు లేని కిటికీలు, నడుస్తున్నప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు రావడం, తల పట్టేసేలా నల్లని పొగ వదలుతూ బస్సులన్నీ తుక్కుగా మారిపోయాయి. వీటిలో ప్రయాణమంటే జనం వణికిపోతున్నారు. అధ్వానంగా ఉన్న వీటిని పక్కన పెట్టి, అవసరమైన వాటికి మరమ్మతు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు.

YSRCP Govt Neglect APSRTC
YSRCP Govt Neglect APSRTC (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 11:16 AM IST

Old Buses in APSRTC : గుప్పుమని పొగ వదలుకుంటూ వెళ్తున్న ఈ బస్సును చూడండి. ఇది విజయవాడలో తిరిగే సిటీ బస్సు. విద్యాధరపురం డిపోకు చెందిన ఇది కొన్ని నెలలుగా ఇలా నగర రోడ్లపై తిరుగుతోంది. దీంతో బస్సులోని ప్రయాణికులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొకటి డుగ్‌డుగ్‌ అంటూ విపరీతమైన శబ్దం చేస్తూ వెళ్తున్న ఈ బస్సు విజయవాడలో నిత్యం రాకపోకలు సాగిస్తోంది. ఈ బస్సు రోడ్డపైకి వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల ఉన్నవారు దీని శబ్దానికి హడలెత్తిపోతున్నారు. దీనిలోకి ఎక్కాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు.

మరమ్మతులు చేయలేమంటున్న మెకానిక్స్ :బాడీ అంతా దెబ్బతిని అధ్వానంగా తయారైన ఈ బస్సును చూడండి. ప్రయాణికులు కూర్చునే సీటు వద్ద అద్దాలు కూడా లేవు. వర్షం పడితే లోపలున్నవారంతా తడిసి ముద్దవుతున్నారు. ఇలాంటి బస్సులు రాష్ట్రవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితిలో జనాల మధ్య తిరుగుతున్నాయి. ఇప్పుడు వీటికి మరమ్మతులు చేయలేమని మెకానిక్స్‌ సైతం చేతులెత్తేస్తున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కొత్త బస్సులు కొనుగోలు చేసి. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు మాత్రం అదించలేదు. డొక్కు బస్సులకు పైపై మెరుగులు దిద్ది రోడ్లపైకి వదిలేసింది. కనీసం మరమ్మతులకు కూడా నిధులు ఇవ్వలేదు. దీంతో స్టీరింగ్‌ పట్టేయడం లేదా ఊడి చేతుల్లోకి రావడం, గేర్‌ బాక్స్‌ పట్టేయడం, చక్రాలు ఊడిపోవడం లాంటివి జరుగుతున్నాయి. ఫలితంగా ప్రమాదాల బారిన పడి ప్రయాణికుల ప్రాణాలు తీస్తున్నాయి.

"కాలం చెల్లిన బస్సులను వాడుతున్నారు. బస్సులు ఎక్కాలంటే భయం వేస్తుంది. సీట్లో కూర్చుంటే చాలు నడుములు పట్టేస్తున్నాయి. బస్సు నుంచి వచ్చే శబ్దం తలనొప్పిగా మారింది. డబ్బులు చెల్లించినా సౌకర్యవంతమైన ప్రయాణం కలగడం లేదు. ఇప్పటికైనా వీటిని మార్చాలని నూతన ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నాం." - ప్రయాణికులు

Jagan Government Neglect RTC : ఆర్టీసీలో 10,654 బస్సులు ఉంటే అందులో సంస్థ సొంత బస్సులు 8369 ఉన్నాయి. వీటిలో 71 శాతం అంటే 5942 బస్సులు 10 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగాయి. సంస్థ నిబంధనల ప్రకారం దూర ప్రాంత సర్వీసుల్లో 10 లక్షల కిలోమీటర్లు దాటితే వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టాలి. అలాగే 10 లక్షల కిలోమీటర్ల తిరిగిన బస్సులను పల్లెవెలుగు, సిటీ సర్వీసులుగా మార్చి 12 లక్షల కిలోమీటర్ల వరకు నడపాలి. ఆ తర్వాత వాటిని తుక్కు చేయాల్సి ఉంది.

ఆర్టీసీలో ప్రయాణమంటేనే బెంబేలెత్తుతున్న జనం :ప్రస్తుతం 12 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన బస్సులు 4815 ఉన్నాయి. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తవి కొనుగోలు చేయకపోవడంతో 15లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన బస్సులు సైతం ఇంకా రోడ్లపైన తిరుగుతున్నాయి. 2500 బస్సులను ఇప్చటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఉందని గతేడాది అధికారులు చెప్పినా జగన్‌ సర్కార్‌ పట్టించుకోలేదు. ఫలితంగా డొక్కు బస్సుల్లో ప్రయాణిస్తూ జనం నరకయాతన అనుభవిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే బస్సుల కండిషన్‌ మెరుగుపరచాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. అయితే వైఎస్సార్సీపీతో అంటకాగుతున్న అధికారులు మాత్రం మరమ్మతులు చేయకుండా అలాగే తిప్పుతున్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. పథకం అమల్లోకి వస్తే మహిళలు పెద్ద ఎత్తున బస్సులు ఎక్కుతారు.

అధ్వాన బస్సుల స్థానంలో కొత్తవి తేవాలని డిమాండ్ :ఈ నేపథ్యంలో సరైన కండిషన్‌ లేని బస్సులను ఇంకా అలాగే తిప్పితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీంతో బస్సుల మరమ్మతులు చేయించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే ఆదేశాలివ్వాలని ప్రజలు కోరుతున్నారు. పూర్తిగా పాడైపోయిన బస్సులను తీసేసి కొత్త బస్సులను రోడ్డెక్కించాలని విన్నవించుకుంటున్నారు.

జగన్​ హయాంలో కష్టాల ఊబిలో ఆర్టీసీ - కొత్త ప్రభుత్వం ఏం చేయనుంది! - YSRCP Govt Neglect RTC Buses

'వైఎస్సార్సీపీ ఘోర ఓటమితో అధికారుల అక్కసు'- కాకినాడలో ఆర్టీసీ ఉద్యోగులపై వేటు - RTC Employees Suspended in Kakinada

ABOUT THE AUTHOR

...view details