Sankranti Festival Rush In Bus Stands And Railway Stations : సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నుంచి జనం సొంతూళ్ల బాట పట్టారు. MGBS, JBS బస్టాండ్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకటలాడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి.
సంక్రాంతిని సొంతూళ్లలో ఘనంగా జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి జనం పల్లెలకు బయలుదేరారు. దీంతో ప్రయాణికులతో బస్టాండులు కిక్కిరిసిపోతున్నాయి. MGBS, JBS సహా ఇతర ప్రయాణ ప్రాంగణాల వద్ద రద్దీ నెలకొంది. మియాపూర్ మదీనాగుడా ప్రాంతాల్లో రహదారులు RTC, ప్రైవేటు బస్సులతో నిండిపోయాయి. బస్టాప్ ల వద్ద రద్దీగా ఉండడంతో కూకట్‌పల్లి, KPHB జాతీయ రహదారిపై వాహనదారులు అవస్థలు పడాల్సి వచ్చింది. ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట్ ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. బస్సులు ఆలస్యం కావడంతో పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ - కిటకిటలాడుతున్న టోల్‌గేట్లు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు రద్దీ కొనసాగుతోంది. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవుల కావడంతో ఎన్ హెచ్ -65పై వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ నుంచి పంతంగి టోల్‌గేట్ వరకూ వాహనాలు ఆగుతూ సాగుతూ ముందుకు కదిలాయి. పంతంగి టోల్ ప్లాజా నుంచి శుక్రవారం 59వేల వాహనాలు వెళ్లగా శనివారం సుమారు 80 వేల వాహనాలు వెళ్లాయని సిబ్బంది తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నుంచి యాదాద్రి జిల్లా దండుమల్కాపురం శివారు వరకు ఆరు వరుసల రహదారి దాదాపు పూర్తి కాగా అక్కడక్కడ పనులు సాగుతున్నాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దండుమల్కాపురం నుంచి 4 వరుసలు రోడ్డు ఉండటం ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద రహదారి ఇరుకుగా ఉండటంతో వాహనాల వేగం తగ్గి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సంక్రాంతి సందడి - కిక్కిరిసిన విజయవాడ బస్టాండ్
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలతో టోల్ గేట్ కిటకిటలాడుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో వాహనాల తాకిడి మరింత పెరిగే అవకాశముంది. ఫాస్టాగ్‌తో రెండు సెకన్లకో వాహనం చొప్పున క్లియర్ చేస్తున్నప్పటికీ రద్దీ తగ్గలేదు. నందిగామ వై జంక్షన్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి, సర్వీసు రోడ్డు నిర్మాణ దశలో ఉండడంతో ట్రాఫిక్ రద్దీ కీసర టోల్ గేట్ పై పడుతోంది. హైదరాబాద్ నుంచి సాధారణ రోజుల్లో 4 గంటల్లో చేరాల్సిన గమ్యం 5 నుంచి 6 గంటలు పడుతోందని వాహన చోదకులు చెబుతున్నారు. జగ్గయ్యపేట వద్ద రద్దీ కొనసాగుతోంది. చిల్లకల్లు టోల్‌గేట్‌లో మొత్తం 12 దారులు ఉండగా అందులో 6 దారులను విజయవాడ వైపు వెళ్లేందుకు ఉంచారు. పండుగ వేళ వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
సంక్రాంతి రద్దీపై ఆర్టీసీ ఎండీ కీలక ఆదేశాలు- ఆ బాధ్యత రవాణా శాఖ అధికారులదే
సంక్రాంతి పండగ వేళ విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గాయి. గన్నవరం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖ వైపు వెళ్లే వాహనాలను విజయవాడలోకి రానీయకుండా పోలీసులు గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్దే దారి మళ్లిస్తున్నారు.
విజయవాడ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతొంది. రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రైవేటు పాఠశాలల బస్సులను వినియోగిస్తున్నారు. 100 కిలోమీటర్ల పరిధిలో 50 బస్సులను ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. అలాగే విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతొంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే ప్రయాణికులతో రైల్వేస్టేషన్ రద్దీగా మారింది. అదేవిధంగా భువనేశ్వర్ వైపు వెళ్లే రైళ్లు వద్ద ప్రయాణికుల రద్దీ కొనసాగుతొంది.
పల్లె'టూరు'కి జనం - కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు