₹3.5 Lakhs Robbery in Srikakulam District : స్కూటరు డిక్కీ నుంచి రూ.3.5 లక్షలు చోరీకి గురైన ఘటన మండల పరిధి దాసన్నపేటలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం దాసన్న పేటకు చెందిన సింగంశెట్టి లింగమూర్తి దినవారీ బజారుమెట్ల వద్ద బియ్యం వ్యాపారం చేస్తున్నారు. తన ఇంటి సమీపంలోని యూనియన్ బ్యాంకు నుంచి రూ.4 లక్షలు తీసుకున్నారు. అనంతరం ఆ మొత్తాన్ని తన ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టారు. బజారు కూడలి రథంవీధి లోని ఓ దుకాణం వద్ద కొన్ని నిమిషాలు వాహనం నిలపి తిరిగి వచ్చి చూసే సరికి డిక్కీలో ఉంచిన డబ్బులో రూ.3.5 లక్షలు లేనట్లు గుర్తించారు.
మరో రూ.50 వేలు ఓ మూలకు చేరి ఉండటంతో చోరీకి పాల్పడిన వ్యక్తి వదిలేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అందు బాటులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా దాదాపు పదేళ్ల వయసున్న ఓ బాలుడు వాహనం నుంచి డబ్బు తీసి మరో వ్యక్తితో ఒడిశా వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై ఫిర్యాదును అందుకున్న పట్టణ ఎస్సై వి. సత్యనారాయణ ఘటనా స్థలాన్ని, సీసీ ఫుటే జీలను పరిశీలించారు. బ్యాంకు నుంచే దుండగులు వెంబడించి ఉంటారని అనుమానం వ్యక్తం చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు.