Central Government Package to Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సిద్ధమైన కేంద్రం 11 వేల 440 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో గురువారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా స్టీల్ ప్లాంట్‌కు పునర్‌వైభవం వస్తుందని భావిస్తున్నారు.
ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడించారు. ప్రధాని చొరవతోనే ఈనిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా తెలియజేశారు.
రాష్ట్రంలోని ఓ జఠిలమైన సమస్య పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం ఆనందించదగిన పరిణామమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రివైవల్ ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్లాంట్ ఉత్పాదకత పెంచి లాభాల బాటలో పయనించేందుకు..ఈ ప్యాకేజీ ఉపకరిస్తుందన్నారు. ఏపీ అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,440 కోట్లు (ETV Bharat) స్టీల్‌ప్లాంటుకు కేంద్ర ప్యాకేజీని ఏపీ ప్రజలు స్వాగతిస్తున్నారని ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కుమారస్వామి, నిర్మలాసీతారామన్, చంద్రబాబు కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్లాంటును మరింత సమర్థంగా నడిపించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.
చరిత్రాత్మక నిర్ణయం: స్టీల్ ప్లాంటుకు కేంద్ర ప్యాకేజీ చరిత్రాత్మక నిర్ణయమని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్యాకేజీపై ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నిర్మలా సీతారామన్, కుమారస్వామికి సైతం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు: మండలిలో మంత్రులు
నేతల సంబరాలు: విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తుందనే సమాచారంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నేతలు సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలతో కలిసి బాణసంచా కాల్చి సందడి చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడంలో విజయం సాధించామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కొత్త ఏడాదిలో కేంద్రం నుంచి అన్ని మంచివార్తలే వస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల తరఫున ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ధన్యవాదాలు తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న స్టీల్ ప్లాంట్‌కి కూటమి సర్కార్ ఆక్సిజన్ ఇచ్చి నిలబెడుతోందన్నారు.