ROWDY SHEETER HALCHAL WITH GUN: వైఎస్సార్ జిల్లా పులివెందులలో తుపాకీ లైసెన్స్‌ల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన లైసెన్సులు అమాయకుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించాయనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. గతేడాది మార్చి నెలలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్ర గాయాలతో త్రుటిలో బయటపడ్డాడు. తాజాగా మరో రౌడీ షీటర్ తుపాకీతో తలపై బలంగా కొట్టడంతో ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు.
పులివెందుల లయోలా డిగ్రీ కళాశాల సమీపంలో బబ్లూ అనే రౌడీషీటర్ తన స్నేహితుడు శివప్రసాద్‌తో కలిసి వేముల మండలం తుమ్మలపల్లికి చెందిన నాగిరెడ్డిపై దాడి చేశాడు. గతంలో ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలని నాగిరెడ్డి అనే వ్యక్తి శివప్రసాద్‌ను అడిగారు. దీంతో రౌడీ షీటర్ బబ్లూతో కలిసి శివప్రసాద్ దాడి చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. అప్పు విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి నాగిరెడ్డిని తలపై బబ్లూ తుపాకీతో కొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడు నాగిరెడ్డిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పులివెందులలో రౌడీలకు ఇష్టానుసారం గన్ లైసెన్స్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 800 మందికి తుపాకీ లైసెన్సులతో పాటు గన్‌మెన్లు ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోనే 180 మందికి తుపాకీ లైసెన్సులు, గన్‌మెన్లు ఉన్నారు. తుపాకీ లైసెన్స్‌లు కలిగిన వారిలో 90 శాతం వైఎస్సార్సీపీ నేతలు, దొంగలు, దోపిడీదారులు, అసాంఘిక శక్తులే అధికమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరికైనా ప్రాణాలకు ముప్పు ఉన్నా, బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖ ప్రజాప్రతినిధులకు పోలీస్ శాఖ తుపాకీ లైసెన్స్ ఇస్తుంది. అంతకు ముందే పూర్వాపరాలను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తుంది. కానీ, గత ప్రభుత్వ హయాంలో పోలీసులు వైఎస్సార్సీపీ నేతలు చెప్పినదానికల్లా తలూపారు. జగన్ సొంత జిల్లాలో అధికార పార్టీ నేతలు చెప్పిన వారందరికీ ఇష్టారాజ్యంగా తుపాకీ లైసెన్సులు, గన్‌మెన్లను కేటాయించారు. వీరిలో ఓ దినపత్రిక విలేకరి కూడా లైసెన్స్ తీసుకోవడం గమనార్హం.