Road Accident at Patancheru ORR : సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని, వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారు రెయిలింగ్‌లో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనమయ్యారు. లారీ బొగ్గు లోడుతో ఉండటంతో మంటలు చెలరేగాయి. లారీ వెనుకభాగం పాక్షికంగా దెబ్బతింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందితో మంటలను ఆర్పేశారు. కారులో ఒకరున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పటాన్‌చెరు సీఐ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. కారు రెయిలింగ్‌కు, లారీకి మధ్యలో ఇరుక్కుపోవడంతో అందులో ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా తెలియడం లేదని అన్నారు. జేసీబీ సాయంతో బొగ్గు కిందకు దించి లారీని పక్కకు జరిపే యత్నం చేస్తున్నారు. మరోవైపు కారులో నుంచి మంటలు రాగానే, లారీ డ్రైవర్ అప్రమత్తమై దిగడంతో ప్రాణాలు దక్కాయి.
"మాకు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ముత్తంగి వద్ద ఓఆర్ఆర్పై రోడ్డప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందితో వచ్చి మంటలను ఆర్పివేశాం. ఆగి ఉన్న లారీని, వెనుక వైపు నుంచి కారు వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మరణించినట్లుగా గుర్తించాం. రోడ్డు రెయిలింగ్, లారీకి మధ్యలో కారు ఇరుక్కుపోయింది. జేసీబీతో లారీని పక్కకు నెట్టి, కారును తీశాం.".- ప్రవీణ్ కుమార్, సీఐ పటాన్‌చెరు