Kristipadu Road Accident :అక్కా! ఊర్లో దేవరకు పండగకు కొత్త బట్టలు తెస్తామని అమ్మానాన్న చెప్పారు కదా. మనం బడి నుంచి ఇంటికి వెళ్లే సరికి ఇద్దరూ వచ్చుంటారు. మనకోసం చాక్లెట్లు కూడా తెచ్చుంటారు. నాకే ఎక్కువ తెస్తారు. అని నాలుగో తరగతి చదువుతున్న చిన్నారి మిథిల్ ఎంతో సంతోషంగా తన అక్కతో చెప్పిన మాటలివి. అయితే నువ్వు అల్లరి చేయకుండా, ఏడ్వకుండా ఉంటేనే నీకు కొత్త బట్టలు, చాక్లెట్లు ఇస్తారు. ఇలా అమ్మానాన్నలను సతాయించకూడదని ఏడో తరగతి చదువుతున్న పూజిత తన తమ్ముడికి మంచి కొన్ని మాటలు చెప్పింది.
చివరికి సాయంత్రం ఆ పిల్లలు కేరింతలు కొడుతూ, హుషారుగా ఇంటికి వెళ్లారు. అక్కడ అందరూ ఏడుస్తున్నారు. వారికి ఏమైందో అర్థంకాని పరిస్థితి. ఊహించని రోడ్డుప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసిందని ఆ పసి హృదయాలకు ఏం తెలుసు. అయినా వారిద్దరి కళ్లు భయం భయంగా తమ అమ్మానాన్న కోసం వెతుకుతున్నాయి. అక్కడే కదల్లేకుండా పడున్న తల్లిదండ్రుల మృతదేహాలను చూసి వారు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అమ్మానాన్న ఇక లేరని తెలిసి వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన చూసిన అక్కడి స్థానికుల గుండె చలించిపోయింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
విజయవాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం - పలు వాహనాలు ధ్వంసం
ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లిలో రాజశేఖర్(38), సుమలత(35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారు గుత్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. గ్రామంలో ఈ నెల 21న దేవర నిర్వహించనున్నారు. దీంతో వారు పండగకు కొత్త దుస్తులు కొందామని అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి వెళ్లారు.
Road Accident in Anantapur District :అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలోనే మార్గమధ్యంలో పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సమీపంలో బొలెరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులిద్దరూ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు.
దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం - ముగ్గురు మృతి
అన్నకి బాయ్ చెప్పడానికి వచ్చి అనంత లోకాలకు - స్కూల్ బస్సు కింద నలిగిన చిన్నారి