Revenue Meetings in AP :రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యుల్‌ను ప్రకటించింది. డిసెంబర్ 6 నుంచి 2025 జనవరి 8 వరకూ వీటిని నిర్వహించనున్నారు. గ్రామస్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి, 22A, ఫ్రీ హోల్డ్, భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను సర్కార్ స్వీకరించనుంది. ఇందులో భాగంగా గ్రామ, మండల స్థాయి, జల్లా స్థాయిలో రెవెన్యూ సదస్సుల షెడ్యుల్‌ను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రజల నుంచి పిటిషన్లు తీసుకోవడంతో పాటు ఆర్టీజీఎస్ వెబ్ పోర్టల్ ద్వారానూ దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల 5 నుంచి గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సుల షెడ్యుల్‌ను ప్రకటించాలని పేర్కొంది. సదస్సు నిర్వహణకు రెండు రోజుల ముందే సదరు గ్రామానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలు, ఎన్జీఓలు, రైతు సంఘాలతో పాటు ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించాలని తెలిపింది. ఆర్వోఆర్, అడంగల్, పహాణీ, ప్రభుత్వ భూముల రిజిస్టర్ లాంటి సమాచారాన్ని సదస్సుకు ముందే సిద్ధం చేసుకోవాలని వివరించింది.
AP Revenue Conference : రెవెన్యూ సదస్సులు భూ వివాదాలను తగ్గించేలా ఉండాలని ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పింది. భూసమస్యల పరిష్కారానికి ఎలాంటి రుసుమూ వసూలు చేయొద్దని ఆదేశించింది. అక్రమణల్లో భూములు కోల్పోయిన బాధితులకు సర్కార్ అండగా ఉంటూ న్యాయం చేస్తోందన్న భరోసా కల్పించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా రెవెన్యూ శాఖలో సంస్కరణలు అమలవుతున్నాయని ప్రజలకు అర్ధమయ్యేలా సదస్సులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.