Relief Operations Budameru Victims : బుడమేరు సృష్టించిన విధ్వంసంతో విజయవాడ అతలాకుతలమైంది. నగరంలోని నాలుగో వంతు భూభాగం నీట మునిగింది. దాదాపు 2,75,000ల మంది వరదల్లో చిక్కుకున్నారు. ఇలాంటి సమయంలో సహాయక బృందాలు బాధితులకు భరోసానిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 23 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. ఒక్కో బృందంలో 30 మంది చొప్పున 690 మంది అత్యవసర విధుల్లో పనిచేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 6,000ల మందిని ముంపు ప్రాంతాల నుంచి రక్షించాయి.
విస్తృతంగా సేవలు అందిస్తున్న బృందాలు : ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నవారికి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం వరద ప్రాంతాల్లో విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. నగరంలో 18 బృందాలు బాధితులకు సాయం చేస్తున్నాయి. ఇండ్లలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బాధితులకు ప్రాథమిక చికిత్స కూడా అందిస్తున్నాయి.
డీజీపీ ద్వారకా తిరుమలరావు వరద ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రామవరప్పాడు ఇన్నర్ రింగ్‌రోడు పక్కనే ఉంటున్న శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్ నివాసం పూర్తిగా నిండిపోయింది. ఐనా ఆయన రోజూ పడవ ద్వారా బయటకొస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నగర పోలీసులతో పాటు ఏపీఎస్పీ, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ యూనిట్ల నుంచి సుమారు 4,000ల మంది విడతల వారీగా పనిచేస్తున్నారు.