Why does Coffee Taste Bitter : చాలా మందికి ఉదయాన్నే కప్పు కాఫీ తాగకుండా రోజు ప్రారంభం కాదు. అలాగే కొందరు తలనొప్పిగా అనిపించినా కాఫీ తాగుతుంటారు. బయట ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ కలిసినా, ఇంటికి బంధువులు వచ్చినా కాఫీ/టీలతో కాస్త సమయం వెచ్చిస్తుంటాం. ఇలా మన రోజువారి జీవితంలో కాఫీ ఒక భాగమైపోయింది. అయితే, కొందరికి కాఫీ చేదుగా లేకపోయినా కూడా ఆ భావన కలుగుతుంటుంది. దీనికి గల కారణాలను ఇటీవల ఓ పరిశోధనలో శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఆ వివరాలు మీ కోసం!
కాఫీ చేదుగా అనిపించడానికి గల కారణాలను జర్మనీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాఫీ తాగే వ్యక్తి జన్యు లక్షణాలు ఇందుకు దోహదపడుతున్నట్లు తేల్చారు. ఈ అధ్యయనంలో భాగంగా కాఫీయా అరబికా మొక్క నుంచి సేకరించిన గింజలను శాస్త్రవేత్తలు రోస్ట్ చేశారు. వాటిని పౌడర్‌గా మార్చి, కాఫీని రెడీ చేశారు. కాఫీలోని కెఫీన్ చాలా చేదుగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అయితే దీన్ని తొలగించిన కాఫీ కూడా చేదుగానే ఉంటోందని గుర్తించారు. దీన్నిబట్టి రోస్టెడ్ కాఫీలో చేదుకు ఇతర పదార్థాలూ కారణమవుతున్నట్లు స్పష్టమవుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇందులో మొజాంబియోసైడ్ కూడా ఉంది. కెఫీన్‌తో పోలిస్తే ఇది 10 రెట్లు అధికంగా చేదుగా అనిపిస్తుంది. ఇది మన బాడీలో చేదుకు సంబంధించిన టీఏఎస్2ఆర్43, టీఏఎస్2ఆర్46 అనే రెండు రకాల గ్రాహకాలను క్రియాశీలం చేస్తుంది. అయితే కాఫీ గింజలను రోస్ట్ చేసేటప్పుడు మొజాంబియోసైడ్ తీవ్రత గణనీయంగా తగ్గుతున్నట్లు కనుగొన్నారు. అందువల్ల కాఫీ చేదుగా ఉండటానికి అది స్వల్పంగానే కారణమవుతున్నట్లు గుర్తించారు.
గుర్రాలు ఎందుకు పడుకోవు? - మీకు 'హార్స్ పవర్' అంటే తెలుసా?
ఈ క్రమంలో రోస్టింగ్ వల్ల మొజాంబియోసైడ్‌కు సంబంధించిన ఇతరత్రా పదార్థాలు ఉత్పత్తవుతున్నాయా అన్నది తేల్చాలని పరిశోధకులు నిర్ణయించారు. రోస్టింగ్ ప్రక్రియలో మొజాంబియోసైడ్ క్షీణించి 7 విభిన్న ఉత్పత్తులుగా రూపాంతరం చెందుతున్నట్లు కనుగొన్నారు. రోస్టింగ్ టెంపరేచర్, ఎంతసేపు రోస్ట్ చేశారన్నదాన్ని బట్టి వీటి పరిమాణం ఉంటోంది. మొజాంబియోసైడ్ క్రియాశీలం చేసే రుచి రిసెప్టార్లను ఇవి కూడా ఉత్తేజితం చేస్తున్నట్లు గుర్తించారు. అయితే కాఫీగా తయారయ్యాక వీటి గాఢత తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొజాంబియోసైడ్, దాని రోస్టింగ్ ఉత్పత్తులకు సంబంధించిన ఒకరకం కాంబినేషన్ కలిగిన కాఫీని తాగిన 11 మంది వాలంటీర్లలో 8 మంది మాత్రమే చేదు టేస్ట్‌ని అనుభవించారు. జన్యుపరమైన అంశాలు ఈ రుచి భావనను ప్రభావితం చేస్తున్నట్లు కనుగొన్నారు. టీఏఎస్2ఆర్43 జన్యురకానికి సంబంధించిన రెండు ప్రతుల్లో వైరుధ్యాలు ఇందుకు కారణమవుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
జర్నీలో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే! - ఇవి మీ వెంట ఉంటే మంచిది