Fake Bail papers: నేరాలకు పాల్పడితే జైలుకు వెళ్లడం ఖాయమే. ఈ విషయం తెలిసీ ఎంతో మంది తప్పించుకోవచ్చనే అతి నమ్మకంతో నేరాలకు పాల్పడుతుంటారు. పోలీసులు తమదైన శైలిలో విచారించి నిందితులను కటకటాలవెనక్కి పంపిస్తుంటారు. కాగా, తాజాగా ఓ రిమాండ్ ఖైదీ ఊహించని పథకంతో జైలు నుంచి విడుదలయ్యాడు. ఆలస్యంగా తేరుకున్న అధికారులు సహనిందితుడి సహకారంతోనే బయటపడ్డట్లు తెలిసి ఆశ్చర్యపోయారు. సీసీ కెమెరాల భద్రత మధ్య గట్టి బందోబస్తు కలిగిన చంచల్‌గూడ సెంట్రల్ జైలు నుంచి ఓ ఖైదీ తెలివిగా తప్పించుకున్నాడు. నకిలీ బెయిల్ పత్రాలతో జైలు అధికారులను, పోలీసులను నమ్మించి విడుదలై వెళ్లిపోయాడు.
ఈ విషయంపై డబీర్‌పురా ఠాణా సీఐ నానునాయక్ ఏమన్నారంటే.. సంతోశ్నగర్కు చెందిన సుజాత్ అలీ ఖాన్ అనే యువకుడిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో నవంబర్ 2న ఓ కేసు నమోదైంది. అదే రోజు అతడిని అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించగా అతడిపై మరుసటిరోజే మరో కేసు కూడా పెట్టారు. కాగా, సుజాత్ అలీ ఖాన్‌కు మొదటి కేసులో రాజేంద్రనగర్ కోర్టు నుంచి బెయిల్ ఉత్తర్వులు వచ్చినట్లు జైలు అధికారులకు ఇచ్చారు. అతడిపై మరో కేసు ఉండటంతో విడుదల చేయడం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో నవంబర్ 26న రెండో కేసులోనూ బెయిల్ మంజూరైనట్లుగా జైలు అధికారులకు పత్రాలు అందజేశారు. అయితే ఆన్‌లైన్‌లో రావాల్సిన బెయిల్ ఉత్తర్వులు రాకపోవడంతో వారంట్లు తనిఖీ చేయగా, రెండో బెయిల్ ఉత్తర్వులు నకిలీవని తేలింది.