Flood Relief Programs in Vijayawada :బుడమేరుకు ప్రభుత్వం గండ్లు పూడ్చడంతో విజయవాడకు వరద ఉద్ధృతి తగ్గింది. వారం రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు ఒక్కొక్కటిగా తేరుకుంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో కొంత మేర నీరు ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులేమీ కలగడం లేదు. నడుము లోతు నీటిలో ఉండలేక సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న వారంతా తిరిగి ఇళ్లకు వచ్చేశారు. గత నాలుగు రోజులు వరద నీటితో చాలా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు కాస్తా తగ్గడంతో ఉపిరి పీల్చుకుంటున్నామని స్థానికులు పెర్కొన్నారు.
శరవేగంగా సాగుతున్న సహాయక చర్యలు :మరోవైపు ప్రభుత్వం పారిశుద్ధ్య పనులను శరవేగంగా చేస్తోంది. రోడ్లపై పేరుకుపోయిన బురదని ఫైర్ ఇంజిన్లతో తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు కాల్వల్లోని చెత్తని తొలగిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా వీధులన్నింటీలో బ్లీచింగ్ చల్లుతున్నారు. బాధితులకు చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
వరద బాధితులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో అనేక మంది దాతలు ముందుకొచ్చి సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఆహార పొట్లాలు, తాగునీరు, పాల ప్యాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రతి ఇంటికీ 25 కేజీల బియ్యం, ఉల్లిపాయలు, మంచినూనె, కందిపప్పు వంటి నిత్యావసరాలు అందిస్తోంది. పౌరసరఫరాల శాఖ మొబైల్ రేషన్ వాహనాల ద్వారా పంపిణీ చేస్తుంది.
"మొదట రెండు రోజులు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు వస్తువలన్ని ఇస్తున్నారు. ఆహార పదార్థాలు, పాల ప్యాకెట్లు ఇస్తున్నారు. ప్రతి ఇంటికి నిత్యావసరాలు అందుతున్నాయి. అధికారులు అడిగి మరి పంపిణీ చేస్తున్నారు విపత్తు వేళ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని చెప్పవచ్చు. వయసుని కూడా లెక్కచేయకుండా సీఎం చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారు." - బాధితులు