Red Sandalwood Smugglers:ఏళ్ల తరబడి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వైఎస్‌ఆర్ జిల్లా చాపాడు మండలానికి చెందిన సోదరులు లాల్ బాషా, ఫకృద్దీన్, జాకీర్ ఏడాదిన్నర కిందట పోలీసులకు చిక్కారు. లాల్ బాషా అంతర్జాతీయ స్మగ్లర్ కాగా మిగిలినవారు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు. వీరికి బెంగళూరులోని కటిగెనహళ్లికి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్ లతీఫ్‌తో సంబంధాలు ఉన్నాయి. లతీఫ్ సూచనల మేరకు ముగ్గురు సోదరులు జిల్లాలోని ఎర్రచందనం చెట్లను దుంగలుగా చేసి కర్నాటక, చెన్నై ప్రాంతాలకు తరలించేవారు.
ఈ నలుగురిని ఏడాదిన్నర కిందట కడప పోలీసులు అరెస్ట్ చేసి కడప జైల్లో పెట్టారు. వారిపై పీడీ యాక్టులు కూడా నమోదు చేశారు. పీడీ యాక్ట్ నమోదైతే ఏడాదిపాటు జైల్లో ఉండాల్సిందే. జైల్లో ఉన్నా నలుగురు స్మగ్లర్లు తమ నేర ప్రవృత్తిని ఏమాత్రం మార్చుకోక పోగా కడప జైలు నుంచే అక్రమాలకు ప్రణాళికలను రచిస్తూ అమలు చేస్తున్నారు. తాజాగా ఈనెల 3న యర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో 3 కోట్ల రూపాయల విలువ చేసే 4 టన్నుల మేలు రకం ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటి అక్రమ తరలింపు వెనుక జైలులో ఉన్న నలుగురు స్మగ్లర్ల హస్తం ఉందని పోలీసుల విచారణలో తేలింది.
రెచ్చిపోయిన ఎర్ర చందనం స్మగ్లర్లు - కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు
వైఎస్‌ఆర్ జిల్లాలో 4 నెలల నుంచి ఎలాంటి హడావుడి లేకపోగా ఒక్కసారిగా 3 కోట్ల రూపాయలఎర్రచందనం పట్టుబడటం కలకలం రేపింది. అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణించి ఎర్రచందనం అక్రమ రవాణా వెనక ఎవరున్నా వదిలిపెట్టవద్దని ఆదేశించడంతో స్మగ్లర్ల అసలు గుట్టు బయటపడింది. కడప జైల్లో ఉన్న నలుగురు స్మగ్లర్ల సూచనల మేరకు సిద్ధవటం అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగల్ని పోట్లదుర్తికి తరలించి డంప్ చేసినట్లు పోలీసు, అటవీశాఖ విచారణలో తేలింది.
జైల్లో ఉన్న స్మగ్లర్లను తరచూ ములాఖత్‌లో వారి కుటుంబ సభ్యులు కలుస్తూ ఉన్నారు. స్మగ్లర్ల సూచనల మేరకు తమిళనాడు నుంచి కూలీలను రప్పించడంలో కుటుంబ సభ్యులు, వారి అనుచరులు సాయం చేసినట్లు తెలిసింది. అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను ఏవిధంగా తరలించాలి? ఎక్కడ డంప్ చేయాలి? ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఏవిధంగా దాటించాలనే సమాచారాన్ని జైలులో ఉన్న స్మగ్లర్లు కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు తెలిసింది.
దీంతోపాటు పోలీసు, అటవీశాఖ సిబ్బందిని ఏవిధంగా లొంగదీసుకోవాలని, వారికి ఎంత ముట్టజెప్పాలనే వివరాలను స్మగ్లర్లు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈనెల 3న పట్టుబడింది ట్రాక్టర్లు, లారీల్లో తీసుకెళ్లే కూలీలు మాత్రమే. వారు కూడా పోట్లదుర్తికి చెందిన కూలీలు. వారంతా మొదటిసారి ఎర్రచందనం దొంగతనానికి పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రధాన స్మగ్లర్ల అనుచరులు ఇతర రాష్ట్రాలకు పారిపోవడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో జైల్లో ఉన్న నలుగులు అంతర్జాతీయ స్మగ్లర్లే కాకుండా మిగిలిన వారిపై నిఘా పెట్టడమా లేక విచారణ చేసి మరింత డంప్ స్వాధీనం చేసుకోవాలా అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
తిరుమలలో ఎర్రచందనం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్