పారిశ్రామిక భూమిలో రియల్ ఎస్టేట్ - తెరవెనుక మంత్రి గుడివాడ, ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ పెద్ద (ETV Bharat) REAL ESTATE IN INDUSTRIAL LAND: తిరుపతి విమానాశ్రయానికి అత్యంత సమీపాన కురుకాల్వ గ్రామం. ఆ పక్కనే కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్‌ఎస్‌సీఎల్‌కు 2009 జనవరిలో ఏపీఐఐసీ 50.7 ఎకరాల భూమి కేటాయించింది. అప్పట్లో రాయితీపై ఎకరానికి 10 లక్షల ధర నిర్ణయించింది. ఇప్పుడు అక్కడ ఎకరం విలువ కనీసం 5 కోట్లకు పెరిగింది. రెండేళ్లలో ఐటీ సేవలకు అనువైన నిర్మాణాలు పూర్తిచేయాలని షరతు విధించింది. 2011 జనవరితో గడువు పూర్తవగా, భూమి తీసుకున్న పదేళ్లకు కూడా హెచ్‌ఎస్‌సీఎల్ సంస్థ పనులు ప్రారంభించలేదు. పనుల ప్రారంభంలో తీవ్రమైన జాప్యం కావడంతో 2019 అక్టోబరులో ఏపీఐఐసీ తుది షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
భూమిని వెనక్కి తీసుకుంటూ 2021 మే 17న ఉత్తర్వులు జారీ చేసింది. 20 రోజుల్లో భూమి తిరిగి అప్పగించాలని, లేదంటే తామే స్వాధీనం చేసుకుంటామని స్పష్టంచేసింది. దీంతో ఉలిక్కి పడిన హెచ్‌ఎస్‌సీఎల్ వెంటనే ఏపీఐఐసీకి మూడు లేఖలు రాసింది. పనుల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నామని, భూముల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కోరింది. ప్రాజెక్టు అభివృద్ధికి ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, పనుల పూర్తికి ఏడేళ్ల గడువు కావాలని అడిగింది. ఈమేరకు కొత్త డీపీఆర్‌నూ పంపింది. డీపీఆర్‌ను పరిశీలించిన ఏపీఐఐసీ రియల్ ఎస్టేట్ తరహాలో స్టార్ హోటళ్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించబోతున్నట్లు గుర్తించింది. ప్రైవేటు సంస్థకు అనుచిత లబ్ధి చేకూర్చే వ్యవహారంలా ఉందని భావించింది.
విశాఖ జిల్లాలో 'అవినీతి ముత్యం' - కనుమరుగవుతున్న ఎర్రమట్టి దిబ్బలు! - YSRCP Leaders Irregularities
హెచ్‌ఎస్‌సీఎల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ఈ పరిణామాలన్నింటినీ ఏపీఐఐసీ వారికి నివేదించింది. హెచ్‌ఎస్‌సీఎల్ వ్యవహారంపై నిర్దిష్ట సమాచారం ఇవ్వాలంటూ 2022 సెప్టెంబర్ 22న కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖకు, అప్పటి ఏపీఐఐసీ ఎండీ జేవీఎన్ సుబ్రమణ్యం లేఖ రాశారు. ఎన్బీసీసీ ఎండీకి కూడా సంబంధిత ప్రతి పంపారు. సొంత వనరులతో ప్రాజెక్టు పూర్తిచేసే ఆర్థిక సామర్థ్యం హెచ్‌ఎస్‌సీఎల్‌కు ఉందా అని అడిగారు. ప్రైవేటు సంస్థ ద్వారా ప్రాజెక్టు అమలుకు సిద్ధం కావడంపై అభ్యంతరం తెలిపారు. ఐటీ సేవల సంస్థలతో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అతి తక్కువ ధరకు భూమి కేటాయిస్తే హెచ్‌ఎస్‌సీఎల్ తీరు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.
తాము కేటాయించిన భూమిలో విల్లాలు, షాపింగ్ సదుపాయాలు, అపార్టుమెంట్లు, స్టార్ హోటళ్లు నిర్మించవద్దన్నారు. పారిశ్రామిక అవసరాలకు సరిపోయే నిర్మాణాలు చేపట్టడంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. నిర్దిష్ట ప్రతిపాదనలు వస్తే పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. సొంత వనరులతో ప్రాజెక్టు చేపట్టే సామర్థ్యం హెచ్‌ఎస్‌సీఎల్‌కు లేకపోతే భూములు తిరిగి ఇచ్చేయాలన్నారు. అయితే, రెండు చోట్ల నుంచి ఏపీఐఐసీకి ఎలాంటి జవాబు రాలేదు. ఈలోపు 2023 మే 17న హెచ్‌ఎస్‌సీఎల్ నుంచి ఏపీఐఐసీకి లేఖ వచ్చింది. కంపెనీ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు జోక్యం చేసుకోవని అందులో పేర్కొంది. తిరుపతి ఎయిర్‌పోర్ట్ వద్ద భూకేటాయింపులను పునరుద్ధరించాలని కోరింది.
అక్రమాలలో ఈ 'అన్న'కు పోటీ ఎవరూ లేరు - అనుచరులను అడ్డుపెట్టుకుని భారీగా దోపిడీ - YSRCP LEADER IRREGULARITIES
ఆ తర్వాత రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రంగప్రవేశంతో పరిణామాలు చకచకా మారిపోయాయి. హెచ్‌ఎస్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ టీఎల్ఎన్ రెడ్డి 2023 జూన్ 21న అమర్నాథ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రాజెక్టు పూర్తికి మరో ఏడేళ్ల గడువు కోరారు. ప్రాజెక్టు ఆలస్యానికి ఏపీఐఐసీ విధించే అపరాధ రుసుము, ఇతర ఛార్జీలు మినహాయించాలన్నారు. దీనిపై "పరిశీలన జరపండి" అంటూ ఆ వినతిపత్రాన్ని మంత్రి ఏపీఐఐసీకి పంపారు. ఆ నోట్ అందిన తర్వాత ఏపీఐఐసీ వైఖరి పూర్తిగా మారింది. హెచ్‌ఎస్‌సీఎల్ కోరుకున్నట్లే నెల రోజుల్లో పనులన్నీ శరవేగంగా పూర్తయ్యాయి. గతంలో కేంద్రానికి లేఖ రాసిన ఏపీఐఐసీ ఎండీ జేవీఎన్ సుబ్రమణ్యం అప్పటికే బదిలీపై వెళ్లారు.
మంత్రి సూచనతో కొత్తగా వచ్చిన ప్రవీణ్‌కుమార్ భూమికి సంబంధించిన వ్యవహారాలపై సమీక్ష చేశారు. 2023 జులై 6న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శికి ఓ ప్రతిపాదన పంపారు. హెచ్‌ఎస్‌సీఎల్‌కు భూకేటాయింపుల పునరుద్ధరణకు అయ్యే 3.14 కోట్ల రుసుము, ప్రాజెక్టు గడవు పొడిగించేందుకు అయ్యే 29.32 కోట్ల ఛార్జీలను మినహాయించాలని సూచించారు. ఐటీ సేవల నిర్మాణాలకే అనే నిబంధన సడలించి, మిశ్రమ వినియోగానికి అనుమతి ఇవ్వాలన్న హెచ్‌ఎస్‌సీఎల్ వినతిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలనే రీతిలో ప్రతిపాదనలు పంపారు. జులై 11 నాటి సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
ఐదేళ్లలో రూ. వందల కోట్ల అక్రమార్జన - అవినీతి 'కాసు'లతో మల్టీప్లెక్స్ నిర్మాణం - YSRCP MLA Irregularities
ఆ తర్వాత 10 రోజులకే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. హెచ్‌ఎస్‌సీఎల్‌కు భూకేటాయింపులు పునరుద్ధరించింది. ప్రాజెక్టు గడువును మరో ఏడేళ్ల పొడిగించింది. భూమి మిశ్రమ వినియోగానికి అనుమతించింది. 3.14 కోట్ల భూముల పునరుద్ధరణ రుసుము, గడవు పొడిగింపునకు అయ్యే 29.32 కోట్ల ఛార్జీలను మినహాయించింది. 20 శాతం భూమిలో ఐటీ సేవలకు అనువైన భవనాలు నిర్మించాలని, మిగిలిన స్థలంలో విల్లాల అభివృద్ధి, అపార్టుమెంట్లు, హోటల్ కట్టవచ్చంటూ అనుమతులు మంజూరు చేసింది.
పరిశ్రమలకు గతంలో ఏపీఐఐసీ కేటాయించిన భూముల్ని ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడంపై అనుమతులకు సంబంధించి 2022 ఫిబ్రవరి 4న పరిశ్రమలు, వాణిజ్యశాఖ జీవో నెంబర్ 6 విడుదల చేసింది. పరిశ్రమలు దివాలా తీసినప్పుడు లేదా కాలుష్యం, పట్టణ విస్తరణ లాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు మాత్రమే అనుమతులు ఇవ్వాలని స్పష్టంచేసింది. అలా ఇచ్చేటప్పుడు భూమి మార్కెట్ విలువలో 50 శాతాన్ని రుసుముగా వసూలు చేయాలంది. లేదంటే 50 శాతం భూమి వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఈ జీవోను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని ప్రభుత్వ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు ఓ ప్రైవేట్ సంస్థకు భారీ లబ్ధి చేకూర్చేలా తిరుపతి భూవ్యవహారాన్ని వెనుకుండి నడిపించారు.
కొండలకు 'కన్నా'లు వేసే 'బాబు' - వసూళ్లలో రా'రాజు' - కాదంటే గన్ను గురిపెట్టి - YSRCP LEADER IRREGULARITIES