Rape on Minor Girl in Nizampatnam :సమాజంలో రోజురోజుకూ మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వావి-వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు మరికొందరు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు ఇంకొందరు. ఆడవారు అర్ధరాత్రే కాదు పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా జంకుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
Rape Cases in Andhra Pradesh : తాజాగా ఓ మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వేమూరు మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక శుక్రవారం నాడు నిజాంపట్నం మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. శుక్రవారం రాత్రి పరిచయం ఉన్న యువకులు మాట్లాడే పని ఉందని చెప్పి ఆ అమ్మాయిని బయటకు పిలిపించారు. అక్కడి నుంచి గ్రామ శివారు తోటలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.
రాత్రి 10 గంటల తర్వాత ఇంటికి వచ్చిన మైనర్ బాలికను మేనమామ గట్టిగా నిలదీయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయిపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించామని వారు పేర్కొన్నారు.