Hydra Ranganath on Buchamma Suicide :పేదలకు ఇబ్బంది చేయాలనేది హైడ్రా అభిమతం కాదని, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే సంస్థ లక్ష్యమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం అనేది రాజ్యాంగంలో భాగమని, పరిశుభ్రమైన వాతావరణం జీవించే హక్కులో భాగమని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే బాధ్యత హైడ్రాకు ఉందని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రంగనాథ్ తెలిపారు. కొన్ని కట్టడాలను కూల్చితే హైడ్రా బాగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారన్నారు. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేశామని స్పష్టం చేశారు.
ఆస్పత్రిలో రోగులు లేరూ : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే సీఎం హైడ్రాను తీసుకొచ్చారని రంగనాథ్ స్పష్టం చేశారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యతనని వెల్లడించారు. అమీన్‌పూర్‌లో ప్రభుత్వం భూములు పెద్దఎత్తున అన్యాక్రాంతం అయ్యాయని రంగనాథ్ తెలిపారు. అమీన్‌పూర్‌లో గతంలో ఓ హాస్పిటల్‌ను కూల్చినా మళ్లీ నిర్మించారన్నారు. అమీన్‌పూర్‌లో హాస్పిటల్‌ను కూల్చివేశారని ప్రచారం చేస్తున్నారని, కూల్చిన ఆస్పత్రిలో రోగులెవరూ లేరని, ఆస్పత్రిని కూల్చేముందు వీడియోరికార్డు చేసినట్లు తెలిపారు.
బూచిగా చూపించవద్దు :ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశాం. కానీ దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదని రంగనాథ్ తెలిపారు. ప్రజలు నివసిస్తున్న భవనాలను అసలు కూల్చలేదని ఆయన తెలిపారు. ఇటీవల కూకట్‌పల్లి నల్లచెరువులో ఆక్రమణలను కూల్చివేశామని, ముందస్తు సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయలేదన్నారు. హైడ్రా మీద భయంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకుందని, బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసి చాలా బాధపడ్డానని రంగనాథ్ తెలిపారు. హైడ్రా వస్తుందని బుచ్చమ్మను కొందరు భయపెట్టారని ఆయన పేర్కొన్నారు. హైడ్రా అంటే భరోసా, బాధ్యత అని దీనిని బూచిగా చూపించవద్దని రంగనాథ్ స్పష్టం చేశారు.