Ranaranga Chowk in Tenali Symbolic for Quit India Martyrs :దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో క్విట్ ఇండియా ఉద్యమం అత్యంత ప్రముఖమైనది. 1942 ఆగస్టు 8న బొంబాయిలో జరిగిన కార్యక్రమంలో మహాత్మాగాంధీ 'డూ ఆర్ డై' అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్‌ని నిషేధించి అగ్రశ్రేణి నాయకులందిరినీ నిర్బంధించింది. దీంతో దేశ వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి.
క్వీట్ ఇండియా తీర్మానంలో పాల్గొన్న తెనాలికి చెందిన కల్లూరి చంద్రమౌళి స్థానికులతో సమావేశమై ఆగస్టు 12న బంద్ చేపట్టారు. తెనాలి టౌన్ హైస్కూల్ నుంచి రైల్వేస్టేషన్ వరకూ ర్యాలీ చేశారు. రైల్వేస్టేషన్‌ని పూర్తిగా తగులబెట్టిన ఉద్యమకారులు తాలుకా కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసు బలగాలు, ఆందోళనకారులు ఎదురు పడ్డారు. వందేమాతరం అంటూ నినాదాలు చేస్తూ ఉద్యమకారులు దూసుకెళ్లారు. పోలీసులు 21 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు ఉద్యమకారులు అమరులవగా, మరెందరో గాయపడ్డారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన చంద్రమౌళితో పాటు అనేక మందిని అరెస్టు చేశారు. ప్రత్యేక న్యాయస్థానం వీరికి రెండేళ్లు జైలు శిక్ష విధించింది.
'చరిత్ర వింటే ఒళ్లు గగుర్లు పుడుతుంది. ఒకింత ఉత్తేజం పెరుగుతుంది. తెనాలిలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమం దేశ వ్యాప్తంగా స్పూర్తినిచ్చింది. ఈ విషయం ఇక్కడ యువతకు తెలియాలి. దీనివల్ల వారిలో దేశ భక్తి పెరుగుతుంది. భరతమాతకు స్వేచ్ఛావాయులు అందించేందుకు తెనాలి కాల్పుల్లో మాజేటి సుబ్బారావు, శిరిగి లింగయ్య, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య, భాస్కరుని లక్ష్మీనారాయణ మరణించారు. వీటిని కళ్లకు కట్టేలా ధర్నాచౌక్‌ను ఎప్పటికప్పుడు పునరుద్దరించేలా చర్యలు చేపడుతున్నాం.' - స్థానికులు