Rajahmundry Railway Station Modernization :విజయవావడ రైల్వే డివిజన్ పరిధిలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అత్యంత ప్రధానమైంది. ఈ స్టేషన్ నుంచి నిత్యం 32 వేల నుంచి 35 వేల మంది ప్రయాణికులు విజయవాడ-విశాఖ-కాకినాడ-భీమవరం వైపు రాకపోకలు సాగిస్తుంటారు. వచ్చే 40 ఏళ్ల నాటికి సుమారు లక్ష మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి గమ్య స్థానాలకు చేరుకుంటారని అంచనా.
రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై సమీక్ష : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి హంగులతో తీర్చిదిద్దాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అమృత భారత్ స్టేషన్ పథకం కింద 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్లాట్ ఫాంల పటిష్ఠత పనులు జరుగుతున్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్ భవంతి స్థానంలో మూడంతస్తుల ప్రాంగణం నిర్మించాలని ప్రతిపాదించారు.
ఆధునిక హంగులతో ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పించేందుకు పలు దఫాలు అధికారులు చర్చించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయవాడ డీఆర్ఎం నరేందర్ పాటిల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను సందర్శించి అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు.