చల్లబడిన వాతావరణం - రాష్ట్రంలో మరో మూడు రోజులుపాటు వర్షాలు (ETV Bharat) Rains Alert in Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని రోజుల క్రితం వరకు ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలకు ఉపశమనం కలిగినట్లైంది. ఇప్పటికే పలుచోట్ల వానలు పడుతుండగా మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ సూచించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 24లోపు వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
గంటకు 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపారు. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. నేడు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. జూన్ 4 లోగా అవి రాష్ట్రాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటే వీటి రాక కొంత ఆలస్యమయ్యేందుకు అవకాశాలున్నాయి. ఏది ఏమైనా జూన్‌లో వర్షాలు అనుకూలంగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రానికి చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ - RAINS IN ANDHRA PRADESH
ఎల్‌నినో కారణంగా 2023-24 పంటకాలంలో రాష్ట్రమంతటా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్, రబీ కలిపి 47.77 లక్షల ఎకరాలు బీడుగా మారాయి. దిగుబడులు లేక రైతులకు రూ.లక్షల్లో అప్పులు మిగిలాయి. ప్రస్తుతం ఎల్‌నిలో బలహీనపడిందని, లానినో అనుకూల పరిస్థితులున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలిస్తాయని అంచనా వేస్తున్నారు. వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగానే ఉండొచ్చని వివిధ వాతావరణ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు మొదలయ్యాయి. పొలాలు కౌలుకు తీసుకోవడంతోపాటు, దుక్కి వేయించే పనిలో నిమగ్నమయ్యారు. వానలు అనుకూలిస్తే ఈ ఏడాది కంది, ఆముదం, పత్తి, వేరుశెనగ పంటల సాగు పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
ఉప్పురైతులను నిలువునా ముంచేసిన అకాల వర్షం - ఆదుకోవాలని ప్రభుత్వానికి వినతి - untimely rains in Prakasam district
ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలో 67.7 మి.మీ., పల్నాడు జిల్లాలోని నూజెండ్ల, దాచేపల్లి మండలాల్లో 41 మి.మీ., ప్రకాశం జిల్లా కురిచేడు, శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లిలో 40 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 62 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. ఆదివారం శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
రాష్ట్రంలో భారీ వర్షం కురిసే సూచన - హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం - Rain Alert In AP