BJP Rajya Sabha Candidate R Krishnaiah :మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. గతంలో వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన పదవీకాలం 4 సంవత్సరాలు ఉండగానే రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ నుంచి ఆర్.కృష్ణయ్యకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది.
మరోవైపు రాజ్యసభ ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన ఆర్.కృష్ణయ్య తొలిసారి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఆయనకు ఆదోని ఎమ్మెల్యే డా.పార్థసారథి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ ఇతర నాయకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మధుకర్‌తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆర్.కృష్ణయ్య ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం స్వీకరించారు. ఇందుకు సంబంధించిన పార్టీ సభ్యత్వ రశీదు పత్రాన్ని వారికి మధుకర్ అందజేశారు.
మంగళవారం నాడు ఆర్.కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయించారు. ఆర్.కృష్ణయ్యను బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. బీసీల సంక్షేమానికి, వారి అభ్యున్నతి కోసం తాను ఇప్పటివరకు అనేక పోరాటాలు చేశానని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. తన సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ నేతలకు తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.