PV Ramesh Said that AP Financial Situation: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రతి పౌరుడు భవిష్యత్తు కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు సంబంధించిన వనరుల దోపిడీలు, అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పీవీ రమేశ్ అన్నారు. మద్యపానం నుంచే రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తుందని విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో పేదల ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే బటన్ నొక్కడమే కాదని ప్రజలతో నిరంతరం సంభాషించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసే జీవోలు ప్రస్తుతం పూర్తి రహస్యంగా ఉంచుతున్నారని నియంత ధోరణి అవలంభిస్తున్న ప్రభుత్వాన్ని, వ్యవస్థల్ని మార్చవలసిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు
ప్రజల్లో చైతన్యం రానంత కాలం ఎవరి రాజ్యం వారిది: పీవీ. రమేష్ - retired IAS PV Ramesh
రాష్ట్రంలో విడుదలవుతున్న ఉత్తర్వులన్నింటిని రహస్యంగా ఉంచుతున్నారని ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా చేశారన్నారు. గతంలో ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్లైన్లో ఉంచేవారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్లకు రాజ్యాంగం పూర్తి రక్షణ కల్పిస్తుందని స్వప్రయోజనాల కోసం వ్యక్తులకు దాసోహం అయితే రాజద్రోహం చేసినట్లేనని రమేష్ అన్నారు. రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోందని ఆయన తెలిపారు.