Purandeswari Started Gaon Chalo Abhiyan Program in Vijayawada : బీజేపీ ఆధ్యర్యంలో 'గావ్ చలో' అభియాన్ కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉందని తెలిపారు. పొత్తుల విషయం గురించి అగ్రనాయకత్వం ఆలోచిస్తుందని వివరించారు. పొత్తుల సంగతి కాకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు. జిల్లాల అభివృద్ధికి కేంద్రం కోట్ల రూపాయలు మంజూరు చేసిందని అన్నారు. కాబట్టి ప్రజల వద్దకు వెళ్లడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదని పురందేశ్వరి అన్నారు.
అప్పులు చేస్తూ ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు: పురందేశ్వరి
రోడ్లు, వైద్య కళాశాలలు, రైతు భరోసా కేంద్రాలు ఇలా అన్నింటికీ కేంద్రం నిధులనే రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఒక్కటీ లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ రకరకాల కారణాలతో లబ్ధిదారుల సంఖ్య ఎందుకు తగ్గిస్తున్నారో తెలపాలన్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఒక్కో పేద లబ్ధిదారునికి ఐదు కేజీల బియ్యం కేంద్రం ఇస్తోందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం కూడా ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టిందని ఆరోపించారు.
AP BJP Chief Criticized to CM Jagan : దేశమంతా బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనను పండుగలా చేసుకున్నారని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ఇవ్వకుండా పిల్లలకు చూసే అవకాశం చేజార్చిందని విమర్శించారు.ఓటరు జాబితాల్లో చాలా అవకతవకలుజరిగాయని పురందేశ్వరి ఆరోపించారు. వైనాట్ 175 నినాదం వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధికి రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదుతోనే ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారని, విచారణకు ఆదేశించారని తెలిపారు. ఇది బీజేపీ సాధించిన విజయంగా పేర్కొన్నారు. ఒక్క తిరుపతి ఉప ఎన్నికలోనే 35 వేల దొంగ ఓట్లు వేయించారని మండిపడ్డారు.