Public Transport In Hyderabad :హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజారవాణాను అభివృద్ధి చేయాల్సి ఉన్నా దాన్ని అమలు చేయట్లేదు. ఆర్టీసీ బస్సుల ఎక్కువగా లేకపోవడం, ఎంఎంటీఎస్ సర్వీసుల విస్తరణ లేక నగరవాసులు సొంత వాహనాల వైపు మక్కువ చూపుతున్నారు. దీంతో నగరంలో విపరీతంగా వాయుకాలుష్యం పెరుగుతుంది. రోడ్లపైకి వచ్చేటప్పుడు మాస్క్ లేకుండా రాలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే రద్దీ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్క్ తప్పని సరిగా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇష్టానుసారంగా వాహనాలు :ఇష్టానుసారంగా వాహనాలు రోడ్డుమీదకు రావటంతో పీఎం 2.5, పీఎం 10లాంటి వెంట్రుక కన్నా తక్కువ మందం ఉండే సూక్ష్మ ధూళికణాల మోతాదు పెరిగిపోతుంది. గ్రేటర్ పరిధిలో 2019లో కిలోమీటర్ 6,500 వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతుండగా 2024కు పదివేలకు చేరుకుంది. ఇందులో 7 వేలకు పైగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయి. సోర్స్ ఆఫ్ అపాయింట్‌మెంట్ స్టడీ ప్రకారం ఏటా నగరంలో 35వేల టన్నులకు మించి పీఎం 2.5 ఉద్గారాలు వెలువడుతున్నాయని తెలిపింది. అందులో రవాణాపరంగానే దాదాపు 10వేల టన్నులు ఉత్పన్నం అవుతున్నట్లు వెల్లడించింది.
పరుగు అందుకోని ఎంఎంటీఎస్ : నగర జనాభాకు 250 వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు కావాలి. గతంలో 121 ఎంఎంటీఎస్ సర్వీసులు ఉండగా రోజూ 1.8లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం వీటిని 80కి పరిమితం చేయడం జరిగింది. దీంతో ప్రయాణికుల సంఖ్య 50వేలకు తగ్గిపోయింది. దీంతో దాదాపు 1.10లక్షల మంది సొంత వాహనాలను కొన్నారు. ఆకస్మికంగా ఎంఎంటీఎస్‌లు రద్దు చేయడం దీనికి గల కారణాలు. వీటిని అధిగమించి అల్వాల్, ఘట్‌కేసర్, తెల్లాపూర్, హఫీజ్‌పేట్, హైటెక్‌సిటీ మార్గాల్లో ఎక్కువ ఎంఎంటీఎస్‌లు నడిపితే చాలా మంది ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి.
మెట్రోరైలు సర్వీసులు : మెట్రోరైలు సర్వీసులు అర్ధరాత్రి వరకు నడిపిస్తే ప్రయాణికులు ఎక్కువగా వినియోగించుకుంటారు. బీహెచ్‌ఇఎల్ నుంచి లక్డీకాపూల్, గచ్చిబౌలి-శంషాబాద్ విమానాశ్రయం, హయత్ నగర్ ప్రాంతాలకు విస్తరిస్తే సొంత వాహనాల వినియోగం తగ్గుతాయి.