TDP OFFICE GRIEVANCE: ఆటస్థలంగా ఉన్న భూమిని తప్పుడు ధ్రువపత్రాలతో అధికారులే కబ్జాదారులకు కట్టబెట్టారని వైఎస్సార్ జిల్లా సిద్ధవటానికి చెందిన పవన్ కుమార్ ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో తరలివచ్చిన బాధితుల నుంచి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గండి బాబ్జి వినతులు స్వీకరించారు.
అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని చెరువుకు గండికోట ప్రాజెక్టు నుంచి చేపట్టిన ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని టీడీపీ నేత చల్లా చంద్రశేఖర్ నాయుడు వినతిపత్రం సమర్పించారు. భూరికార్డుల్ని ఆన్‌లైన్ చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని కర్నూలు జిల్లా కౌతాళం మండలానికి చెందిన ఉప్పులపాటి వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. తన తోటకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నీరులేక అయిదెకరాల్లో దానిమ్మతోట ఎండిపోయిందని అనంతపురం జిల్లా నార్పల మండలానికి చెందిన శ్రీనివాసుల నాయుడు వాపోయారు.