Prathidwani on Polavaram Project :అన్నమాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై తమ ప్రాధాన్యమేంటో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టు సందర్శనతోనే తన క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. తమ గత హయాంలో ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేసిన స్ఫూర్తిని మళ్లీ గుర్తు చేస్తూ ప్రాజెక్టు ప్రాంతమంతా చుట్టివచ్చారు ముఖ్యమంత్రి. మళ్లీ ప్రతి సోమవారం పోలవారంగా, సాధ్యమైనంత వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అదే సమయంలో అయిదేళ్ల వైఎస్సార్సీపీ హయాంలో ప్రాజెక్టుకు జరిగిన నష్టంపైనా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇప్పుడు ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆ పరిస్థితుల్లో ఉంది? ఇకనైనా గడువులోగా ఆ స్వప్నం సాకారం కావాలంటే పోలవరంపై ఎలా ముందుకు సాగాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో సాగునీటి సంఘాల సమాఖ్య ఏ. గోపాలకృష్ణ, సాగునీటి రంగం నిపుణులు టి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
AP CM Chandrababu Polavaram Tour :సోమవారం పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై అక్కడికక్కడే వారిని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి సీఎం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రానికి శాపంగా మారాయని వ్యాఖ్యానించారు. అనంతరం జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం తాజా స్థితిగతులపై సీఎంకు ప్రజంటేషన్ ఇచ్చారు.
ప్రాజెక్టును ఆలస్యం చేయడం చిన్న తప్పిదం కాదు : పోలవరంలో ఇంత నష్టం జరగడానికి బాధ్యులెవరని సమీక్షలో చంద్రబాబు అధికారులను నిలదీశారు. 2019, 2020 వరదల సమయంలో అధికారులు ఎవరున్నారు? డయాఫ్రంవాల్ ధ్వంసం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఆ సమయంలో స్థానికంగా చీఫ్ ఇంజినీర్ ఉన్నారని ఈఎన్‌సీ నారాయణరెడ్డి సమాధానం ఇచ్చారు. 'ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా మీరూ బాధ్యత వహించాలి కదా మీరు చూసుకోవాలి కదా' అని సీఎం నిలదీశారు. అందుకు ఆయన సమధానం చెప్పలేకపోయారు. ప్రాజెక్టును ఆలస్యం చేయడం చిన్న తప్పిదం కాదని క్షమించరాని నేరమని, దిద్దుకోలేని నష్టం జరిగిందని అని సీఎం అన్నారు.