Prathidwani Debate on Viveka Daughter Sunitha Press Meet:సాధారణంగా ఏ హత్య కేసునైనా పోలీసులే నాలుగైదు రోజుల్లో తేల్చేస్తారు. అసలు నేరస్తులను అరెస్ట్ చేస్తారు. వైఎస్ వివేకానందరెడ్డి సాధారణ వ్యక్తి కాదు ఆయన మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ సీఎం సోదరుడు, ప్రస్తుతం సీఎం బాబాయ్ సొంత ఇంట్లో అత్యంత కిరాతకమైన పద్దతిలో వివేకాను హత్య చేసి ఐదేళ్లవుతోంది. ఇంతవరకు ఈ కేసులో పురోగతి లేదు. సూత్రధారులు ఎవరో ఎందుకు తేల్చలేదు. ఇవే ప్రశ్నలు వివేకా కుమార్తె సునితారెడ్డి సంధించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివేకా హత్యను రాజకీయంగా వాడుకున్న జగన్ తన చెల్లెలు సునీతారెడ్డి ప్రశ్నలకు సమాధానం ఎందుకు ఇవ్వట్లేదు అనేది నేటి ప్రతిధ్వని చర్చ. చర్చలో ఎం.సుబ్బారావు (న్యాయ నిపుణులు), ఎన్.చక్రవర్తి (వివేకా కేసుపై పరిశోధకులు), రవిశంకర్‌రెడ్డి (రాజకీయ విశ్లేషకులు) పాల్గొన్నారు.
జగన్ పార్టీకి ఓటేయొద్దు- మా నాన్నని వాళ్లే చంపారు : వైఎస్ సునీత
వివేకానందరెడ్డి కుమార్తె సునితారెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం జగన్ నుంచి ఎందుకు జవాబు రావట్లేదని ఎం.సుబ్బారావు ప్రశ్నించారు. సునీత చెప్పినట్లు మనమధ్యే తిరుగుతున్న ఆ హంతకులు ఎవరయి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేశారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారా? అని అన్నారు. హత్య జరిగిన రోజు జగన్ సొంత ఛానెల్ సాక్షిలో గుండెపోటుతో మృతి అని గంటలపాటు ప్రసారం చేశారు. విజయసాయిరెడ్డి మీడియాకు అదే చెప్పారు. గొడ్డళ్లతో నరికిచంపిందే కాకుండా రక్తపు మరకలు తుడిచేశారు. హంతకులను పచ్చిగా సమర్థిస్తున్న జగన్ విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారని అన్నారు.