ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కునారిల్లుతోన్న పొందూరు ఖాదీ వస్త్ర పరిశ్రమ - ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్న చేనేతలు - Ponduru Khadi Workers Problems

Ponduru Khadi Workers Facing Problems: గాంధీజీ మెచ్చిన ఖద్దరు. అక్కినేని అంచు పంచెలుగా అలరింపు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖాదీకి ఉన్న గుర్తింపు. స్వదేశీ ఉద్యమకాలంలో తెలుగువారి కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన ఈ నేత వస్త్రం ప్రస్తుతం కునారిల్లుతోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్నా నేత కార్మికులకు ఆదాయం కరవైన దుస్థితి. ప్రభుత్వాల సహకారం లేక వారంతా నిట్టూరుస్తున్నారు.

Ponduru Khadi Workers Facing Problems
Ponduru Khadi Workers Facing Problems (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 11:09 AM IST

Ponduru Khadi Workers Facing Problems :స్వదేశీ ఉద్యమ సమయంలో పొందూరు ఖద్దరు గొప్పతనం గురించి తెలుసుకున్న గాంధీజీ మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నారు. అందుకు తన కుమారుడు దేవాస్ గాంధీని పొందూరుకు పంపారు. ఇక్కడి వస్త్రాల తయారీ, నాణ్యతను చూసి దేవాస్ ఎంతో ముచ్చటపడ్డారట. ఆయన చెప్పిన వివరాలతో బాపూజీ 'యంగ్ ఇండియా' పత్రికలో వ్యాసం రాశారు. దాన్ని చదివిన అనేకమంది నాయకులు, ఉద్యమకారులు పొందూరు గ్రామానికిక్యూ కట్టారు. అలా మొదలైంది పొందూరు ఖాదీ వైభవం. 1955లో ఆచార్య వినోభాబావే శంకుస్థాపన చేసిన పొందూరు చేనేత సంఘ భవనమే నేడు ఆంధ్ర ఫైన్‌ ఖాదీ కార్మికఅభివృద్ధి సంఘంగా మారింది.

మండుటెండల్లో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా పొందూరు నేత చీర - చేపముల్లే ప్రత్యేకం - Ponduru Khadi Sarees

గతంలో పొందూరు ఖాదీ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులు 8-9 వేల వరకు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 11 వందలకు చేరింది. ఏడాదికి 15 నుంచి 20 కోట్ల రూపాయలుగా ఉన్న టర్నోవర్ 5 కోట్లకు తగ్గిపోయింది. పొందూరు వస్త్రం నేత కోసం మొదట వాలుగ చేప దవడ ఎముకతో పత్తిని ఏకుతారు. ఇలా చేయడం వల్ల పత్తిలో ఉండే మలినాలు తొలగి, వస్త్రం దృఢంగా ఉంటుందని చెబుతారు. దూది ఏకిన తర్వాత మగ్గానికి చేరే ముందు మళ్లీ 8 దశల్లో శుద్ధి చేస్తారు. ఇవన్నీ చేతులతో చేసే ప్రక్రియలే. ఇలా సిద్ధం చేసిన దారంతో ఒక పంచె నేయడానికి 20 నుంచి 30 చీరకు 30 నుంచి 35 రోజుల సమయం పడుతుంది. రోజంతా భార్య, భర్తలిద్దరూ కష్ట పడి పనిచేస్తే 300 రూపాయలు ఆదాయం రాని పరిస్థితి. ప్రస్తుతం పంచెలు, చీరలు, టవళ్లు, చేతి రుమాళ్లతోపాటు చొక్కాలకు అవసరమైన వస్త్రాలను నేస్తున్నారు.

ప్రసుత్తం పొందూరు ఖాదీని నేస్తున్న వారంతా 40 ఏళ్ల వయసు పైబడిన వారే. వీరంతా పాత మూస పద్ధతులనే కొనసాగిస్తున్నారు. ఇది ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీంతో ఆదాయం ఉండటం లేదు. ఈ కారణంగా యువత నేత వైపు మరలడం లేదు. ప్రత్యామ్నాయంగా ఆధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చి యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే ఈ రంగం తిరిగి కోలుకునే అవకాశం ఉంది. అందుకు ప్రభుత్వం రాయితీపై రుణాలిచ్చి ప్రోత్సహించాలి. మార్కెటింగ్ సౌకర్యాన్ని విస్తృతం చేయాలి.

నేతన్న ఉపాధిపై జగనన్న కొరడా - ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్న చేనేతలు - ponduru khadi clothes

ABOUT THE AUTHOR

...view details