Political Parties Election Campaign:ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి తిరిగి తమ పార్టీ చేపట్టే కార్యక్రమాలను నేతలు ప్రజలకు వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రచారం పోటాపోటీగా జరిగింది. విజయనగరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విజయనగరం మండలం ముడిదాంలో ఇంటింటి ప్రచారం చేశారు. రాజాం వైసీపీ అభ్యర్థి తలే రాజేష్ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయనగరం పార్లమెంటు అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, రాజేష్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. పార్వతీపురం వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు, విజయనగరం వైసీపీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం చేపట్టారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. విజయీభవ యాత్ర పేరుతో ఆత్మకూరు మండలం వాసిలిలో పర్యటించిన విక్రమ్‌రెడ్డిని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ మహిళలు సమస్యలపై ప్రశ్నించారు. వారికి వైసీపీ నాయకులు సర్ది చెప్పారు. సీఎం జగన్ బటన్ నొక్కినా ఆసరా, చేయూత పథకాల డబ్బులు జమకాలేదని బీసీ కాలనీ మహిళలు నిలదీశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం సిద్ధారెడ్డి గారి పల్లెలో బీటెక్ రవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.