Palnadu Double Murder Case : పల్నాడు జిల్లా నకరికల్లులో డబ్బుకోసం తోబట్టువు, అన్నను, తమ్ముడిని హతమార్చిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు మంగళవారం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. 'మా డబ్బు కోసం నువ్వు అడ్డొస్తున్నావు నిన్ను చంపాలని అన్న పథకం వేశాడు. నీ అడ్డు తొలగించుకుని చెరో రూ.35 లక్షలు పంచుకుంటాం’ అని సోదరితో తమ్ముడు మద్యం మత్తులో అన్న మాటలివి.
ఆ మాటలు విన్న నిందితురాలిలో అప్పటివరకూ లేని ఆలోచన పుట్టింది. వెంటనే ప్రియుడికి విషయం చెప్పి సోదరులను చంపేసి ఆ డబ్బేదో మనమే తీసుకుందామని తన మనసులో మాట చెప్పింది. హత్యలకు తాను దూరమని చెప్పాడు. కానీ అందుకు అవసరమైన సాయం చేస్తానని అతడు తెలిపాడు. ఈ క్రమంలో నిందితురాలు తన కాలనీలో జులాయిగా తిరిగే నలుగురు మైనర్లకు డబ్బు ఆశ చూపింది. వారి సహాయంతో గుట్టుగా అన్న, తమ్ముడిని వేర్వేరుగా హత మార్చింది. ఇదంతా పక్కా ప్లాన్‌తో అమలు చేసింది.
పక్కా ప్రణాళికతో హత్యలు : నకరికల్లు యానాదులకాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తలపాల పోలరాజు అనారోగ్యంతో ఈ సంవత్సరం జనవరి 4న మరణించారు. ప్రభుత్వం నుంచి ఆయన కుటుంబానికి సుమారు రూ.70 లక్షల ఆర్థిక ప్రయోజనాలు రానున్నాయి. ప్రభుత్వం నుంచి అందే డబ్బు విషయంలో పోలరాజు కుమారులు గోపీకృష్ణ (పోలీసు కానిస్టేబుల్), దుర్గా రామకృష్ణ, కుమార్తె కృష్ణవేణి మధ్య వివాదాలు తలెత్తాయి. పెద్దలు పంచాయితీ చేసినా రాజీ కుదరలేదు.
ఈ నేపథ్యంలో ఓ రోజు తమ్ముడు దుర్గారామకృష్ణ కృష్ణవేణి ఇంటికి వచ్చాడు. ‘అన్న గోపీకృష్ణ నిన్ను చంపేసి, ఆస్తి మొత్తం పంచేసుకుందామని చెప్పాడని’ ఆమెతో అన్నాడు. దీంతో అప్రమత్తమైన ఆమె సోదరులిద్దరినీ చంపేందుకు ప్రణాళిక రచించింది. నకరికల్లుకు చెందిన తన ప్రియుడు మల్లాల దానయ్యకు ఈ విషయాన్ని చెప్పింది. అయితే నేరుగా తాను హత్యల్లో పాల్గొనని డబ్బుతోపాటు మృతదేహాలను తరలించేందుకు వాహనం సమకూరుస్తానని ప్రియుడు తెలియజేశాడు.