Police Solved Mystery of Road Accident Case:చిన్నపాటి వివాదం హత్యకు దారి తీసింది. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఓడ్రైవర్, క్లీనర్ అత్యంత కిరాతకంగా లారీతో ఎక్కించి హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ చివరకు కటకటాలపాలయ్యారు. ముందుగా పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసుకోగా విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.
ఇదీ జరిగింది:పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంఈ నెల 11వ తేదీన నాగపూర్ నుంచి కందిపప్పు లోడుతో బయలుదేరిన ఏపీ 39 టీ 0979 లారీ 12వ తేదీ రాత్రికి తెలంగాణలోని వైరాకు చేరింది. అక్కడి నుంచి మధిర మీదుగా విజయవాడకు వెళ్లే క్రమంలో వైరా దాటిన తర్వాత ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సోమయ్య అనే వ్యక్తి వాహనానికి లారీ స్వల్పంగా తాకింది. దీంతో ఆగ్రహం చెందిన సోమయ్య లారీని ఓవర్టేక్ చేసి పాలడుగు వద్ద లారీ డ్రైవర్ రామిశెట్టి దుర్గారావుతో వాగ్వాదానికి దిగాడు. లారీ డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఖమ్మం జిల్లా కృష్ణాపురం దగ్గరకు వచ్చేసరికి సోమయ్య మళ్లీ ఓవర్ టేక్ చేసి లారీని అడ్డగించి తిరిగి వాగ్వాదానికి దిగాడు.
లారీ డ్రైవర్ ఎంత చెప్పినా సోమయ్య వినకపోవడంతో లారీ క్లీనర్ సూచనతో డ్రైవర్ దుర్గారావు సోమయ్యను వెనక నుంచి ఢీ కొట్టాడు. ఈ క్రమంలో కిందపడిన సోమయ్య పైనుంచి లారీని ఎక్కించగా తల పగిలి శరీరం చిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డ్రైవర్, క్లీనర్ లారీని ముందుకు తీసుకువెళ్లి దెందుకూరు దాటిన తర్వాత మూలమలుపు వద్ద ఎల్లమ్మ గుడి పక్కన లారీని నిలిపివేసి పారిపోయారు.