Police Searching for Narasapuram MPDO: నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. బుధవారం సిగ్నల్ ఆగిన ప్రాంతంలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. నేడు కేసరపల్లి నుంచి విజయవాడ వైపు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి గాలింపు చర్యలు ప్రారంభించారు. 30 మంది సిబ్బందితో రెండు పడవల్లో బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గత రెండు రోజులుగా ఏలూరు కాలవలో ఆచూకీ కోసం గాలింపు చేస్తున్నారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మధురానగర్ రైల్వే స్టేషన్లో ఎంపీడీవో దిగారు.
రైల్వే స్టేషన్ నుంచి కాలవకట్ట వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర ఎంపీడీవో నడిచారు. అర్ధరాత్రి సమయంలో కాలవలోకి దూకి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి నీళ్లలో దూకినట్లు పెద్దగా శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఆచూకీ కోసం వెతుకుతున్నారు. తండ్రి ఆచూకీ కోసం నిన్నంతా ఏలూరు కాలవ కట్టపైనే కుమారులు ఎదురుచూశారు. గాలింపు చర్యలు నేడు కొనసాగుతున్నాయి. ఎంపీడీవో మిస్సింగ్‌పై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఎంపీడీవో తనకు రాసిన లేఖలో వివరాలను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో మిస్సింగ్ కేసు విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో మిస్సింగ్‌కు కారకులైన అందరిపైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.
కాగా వైఎస్సార్సీపీ నేతల బెదిరింపులతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు అదృశ్యమైన విషయం తెలిసిందే. అయితే ఈనెల 15న అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ ఇంకా లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆయన కోసం కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా మాధవాయిపాలెం రేవు నిర్వహణలో వైఎస్సార్సీపీ నేతలు సాగించిన ఆర్థిక అక్రమాలే రమణారావు అదృశ్యానికి కారణంగా కనిపిస్తోంది.
రేవుకు ఏటా ఫిబ్రవరి-మార్చి నెలల్లో వేలంపాట నిర్వహించాలి. మార్చి 31తో రేవు వేలంపాట గడువు ముగిసినా ఎన్నికల నేపథ్యంలో కొత్తగా పాట నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం అధికారులే రేవు నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలి. కానీ వైఎస్సార్సీపీ నేతలు చక్రంతిప్పి పాత పాటదారుడికే రోజూ లక్షా 2 వేల 904 రూపాయలు చెల్లించేలా అప్పగించేశారు. అయితే రెండు నెలలుగా డబ్బులు చెల్లించకుండా 54 లక్షల రూపాయలు బకాయిలు పెట్టేశారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ చీఫ్ విప్ ప్రసాదరాజు అండతోనే ఫెర్రీ పాటదారు సొమ్ము చెల్లించకుండా తనను దబాయిస్తున్నట్లు రమణారావు లేఖలో రాశారు.