Lentils Fraud Case Registered To Merchants:రైతుల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పంటల కొనుగోలు సమయంలో దళారులు చేస్తున్న ఘరానా మోసం రైతుల చొరవతో తూనికలు, కొలతల శాఖ తనిఖీల్లో బట్టబయలైంది. దీనితో కందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిని పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.
Merchants Cheating In Purchase Of Lentils:అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో కందుల కొనుగోలు సమయంలో జరిగిన తూకాల్లో దళారులు చేస్తున్న మోసాన్ని రైతులు గమనించి వారిని అడ్డుకున్నారు. దళారులు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్ కాటా యంత్రాన్ని, తమ నుంచి సేకరించిన కందుల బస్తాలను తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని రైతులు అడ్డగించి వజ్రకరూరు పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో గుంతకల్లు ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఆహార తనిఖీ నిపుణుల బృందం పోలీసు స్టేషన్ లో రైతులు పట్టుకున్న ఎలక్ట్రానిక్ కాటా యంత్రంను తెరచి పరిశీలించగా రైతులను మోసం చేయడానికి దళారులు అమర్చిన రిమోట్ కంట్రోల్‌తో నడిచే చిప్‌ను వారు కనిపెట్టారు.
అయిదుగురిపై కేసు నమోదు:వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి ఎలక్ట్రానిక్ కాటా యంత్రంలో చిప్ అమర్చి రిమోట్ కంట్రోల్‌తో రైతుల నుంచి 50 కేజీల బస్తాకు గాను 12 కేజీలను అదనపు కందులను సేకరిస్తున్నట్లు నిరూపణ అయిందన్నారు. మోసానికి పాల్పడిన ఐదుగురు దళారులపై చాబాలకు చెందిన రైతు రుద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. తూనికలు కొలతల శాఖ అధికారులు ఎలక్ట్రానిక్ కాటాను సీజ్ చేసి దళారులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.