Police Interrogating The Accused In The Gachibowli case :హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కలకలం సృష్టించిన కాల్పుల ఘటన కేసులో విచారణ కొనసాగుతోంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్‌రెడ్డిని శనివారమే అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. సీసీఎస్, ఎస్‌వోటీ క్రైమ్ బృందాలు నిందితుడి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే నిందితుడి నుంచి 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని బిహార్ నుంచి కొనుగోలు చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 80 వరకూ చోరీ కేసులు ఉన్నాయి.
ఇంతకీ ఏం జరిగిందంటే :ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ పాత నేరస్థుడు. 2022 మార్చి నెలలో విచారణ నిమిత్తం అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో తప్పించుకుపోయాడు. అప్పటినుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇటీవల సైబరాబాద్ పరిధిలోని మొయినాబాద్, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు చోరీలు చేశాడు.
కాగా నిందితుడు ఎక్కువగా ఇంజినీరింగ్ కాలేజీల్లో చోరీ చేస్తుంటాడు. ప్రవేశాలు, పరీక్షలు, హాస్టల్ ఫీజు డబ్బులు కళాశాలల్లో ఉంటాయని పక్కా పథకంతో చోరీలు చేస్తాడు. ఇటీవల నార్సింగి, మొయినాబాద్‌లో జరిగినటువంటి చోరీల్లో వేలిముద్రల్ని విశ్లేషించగా ప్రభాకర్ వేలిముద్రలతో సరిపోలాయి. నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు దోపిడీ చేసిన డబ్బుతో వీకెండ్స్‌లో పబ్‌కు వెళ్తున్నట్లుగా సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. ఐటీ కారిడార్‌లోని పబ్‌ల సిబ్బంది, బౌన్సర్లకు నిందితుడికి సంబంధించిన ఫొటోలిచ్చి ఆచూకీ తెలిస్తే సమాచారమివ్వాలని సూచించారు.