Vajedu SI Suicide Case Latest Update : ఈ నెల 2న ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఓ మహిళ వేధింపులే ఎస్సై చావుకు ప్రధాన కారణమని గుర్తించి ఆమెను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ బండారి కుమార్ వెల్లడించారు.
సీఐ బండారి కుమార్ వివరాల ప్రకారం, 'ఈ నెల 2న ఉదయం వాజేడు మండలం ముల్లెకట్ట వారధి సమీపంలోని ఓ రిసార్టులో ఎస్సై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దుదియతండాకు చెందిన బానోతు అనసూర్య అలియాస్ అనూషపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించాం. ఆమె ఓ కళాశాలలో అడ్మిన్ స్టాఫ్‌గా విధులు నిర్వహిస్తోంది. ఏడు నెలల క్రితం రాంగ్ కాల్ ద్వారా ఎస్సైని పరిచయం చేసుకుని, ఆయనను పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడవచ్చని భావించింది.
తరచూ ఎస్సై హరీశ్‌కు ఫోన్ చేస్తూ సాన్నిహిత్యం పెంచుకుంది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని హరీశ్‌పై ఆమె ఒత్తిడి తెచ్చింది. ఆయన నిరాకరించడంతో తనను శారీరకంగా ఉపయోగించుకుని తిరస్కరిస్తున్నట్లు మీడియా, ఉన్నతాధికారులకు చెబుతానంటూ ఎస్సైని భయాందోళనలకు గురి చేసింది. పెళ్లి చేసుకోకుంటే చచ్చిపొమ్మంటూ ఇబ్బందులు పెట్టడంతో తీవ్ర మనోవేదనకు గురైన హరీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని విచారణలో తేలింద'ని సీఐ వివరించారు. ఈ మేరకు ఆ మహిళపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ స్పష్టం చేశారు.