Police Case Against Four People on Dastagiri Complaint: వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్సార్సీపీ నాయకులకు అనుకూలంగా, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని దస్తగిరిని బెదిరించిన కేసులో నలుగురిపై కేసు నమోదైంది. వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి, గతంలో కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేసిన నాగరాజు, యర్రగుంట్ల సీఐగా పనిచేసిన ఈశ్వరయ్యపై కేసులు నమోదయ్యాయి. నలుగురిపై ఈనెల 3వ తేదీ దస్తగిరి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
2023 అక్టోబరు నుంచి 2024 ఫిబ్రవరి వరకు అట్రాసిటీ కేసులో దస్తగిరి కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేసే సమయంలో డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య బెదిరించడంతో పాటు వివేకా కేసులో వైఎస్సార్సీపీ నేతలకు అనుకూలంగా మాట్లాడాలని కొట్టినట్లు ఫిర్యాదులో తెలిపాడు. కడప జైల్లో నవంబర్ 8న డాక్టర్ చైతన్యరెడ్డి బ్యారెక్ లోకి వచ్చి 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు చెప్పాడు. రాంసింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు తెలిపారు.