Drug Racket Arrest In Bowenpally Hyderabad :హైదరాబాద్ బోయిన్పల్లి పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి రూ.8.5 కోట్లు విలువైన 8.5కిలోల ఎఫిటమిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ఒక కారు 3సెల్ఫోన్లు సీజ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలకు చెందిన కుంచాల నాగరాజు కుటుంబం బతుకుదెరువు కోసం షాపూర్‌కు వచ్చింది. పదవ తరగతి వరకూ చదివిన నాగరాజు తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. నగరంలో పలు కాంట్రాక్టులు ఒప్పుకుని పని చేసస్తున్నాడు. ఇదే క్రమంలో గోసుకొండ అంజిరెడ్డి అనే వ్యక్తి అతనికి పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ తయారు చేసేందుకు గోదాములు కట్టే పనిని అతనికి అప్పగించాడు. తనకు ఉన్న పరిచయాలతో నాగరాజుకు పలు కాంట్రాక్టులు అంజిరెడ్డి ఇప్పించడంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది.
అంజిరెడ్డి పలు దుకాణాలకు, వ్యక్తులకు తరచూ డ్రగ్స్ విక్రయిస్తూ సులభంగా డబ్బు సంపాదిస్తుండటం నాగరాజు గమనించాడు. జూన్‌లో బొంతుపల్లిలోని తన మరో డ్రగ్స్ తయారి యూనిట్ వద్దకు నాగారాజును తీసుకెళ్ళిన అంజిరెడ్డి మూడు ప్లాస్టిక్ కవర్లను ఇచ్చి రహస్య ప్రదేశంలో దాచమని చెప్పాడు. నాగరాజును తన వ్యాపారంలో భాగస్వామ్యం అవ్వాలని కోరాడు. డ్రగ్స్‌ను ఎంత ఎక్కువ మందికి అమ్మితే అంత డబ్బు వస్తుందని చెప్పడంతో నాగారాజు ఆశపడ్డాడు. కానీ ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. గుమ్మడిదలలోని అంజిరెడ్డికి చెందిన డ్రగ్స్ తయారి యూనిట్‌పై పోలీసులు దాడి చేసి అతడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :ఆదివారం రాత్రి ముగ్గరు వ్యక్తులు జిన్నారం నుంచి ఎఫిటమైన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు వారు ఏ దారిలో వస్తున్నారు వంటి వివరాలు తెలుసుకుని అక్కడ కాపలా కాశారు. బోయిన్పల్లి పోలీసులను అలర్ట్ చేశారు. సుచిత్ర నుంచి ప్యారడైజ్‌కు వెళ్లే క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న మహేంద్ర గ్జైలో కారును వెంబడించారు. డైరీ ఫార్మ్ రహదారిపై పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు.
కిలో డ్రగ్స్ కోటి రుపాయలు : అనంతరం వాహనాన్ని తనిఖీ చేయగా కారు డిక్కీలో మూడు పింక్ కవర్లను గుర్తించారు. వాటిని తెరిచి చూడగా అందులో ఎఫిటమైన్ అనే డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 8.582 కిలోల మత్తుపదార్థాలను గుర్తించినట్లు చెప్పారు. దీని విలువ రూ.8.50 కోట్లు ఉంటుందని వెల్లడించారు. డ్రగ్స్‌తో పాటు నిందితుల నుంచి కారు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎఫిటమైన్ డ్రగ్ విలువ కిలో కోటి రూపాయలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా వాసి నాగరాజు, కారు డ్రైవర్ వినోద్, మరో పెడ్లర్‌ను అరెస్టు చేశారు.