ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధూల్‌పేట్​లో గంజాయి 'పుష్ప' - ఎట్టకేలకు అంగూరి భాయి అరెస్టు - DHOOLPET WOMAN GANJA PEDDLER ARREST

ఎట్టకేలకు చిక్కిన ధూల్‌పేట్‌ అంగూరి భాయి అలియాస్‌ అరుణా భాయి - అబ్కారీ శాఖలో ఇప్పటివరకూ 25 కేసులు నమోదు

Dhoolpet Woman Ganja Peddler Arrest
Dhoolpet Woman Ganja Peddler Arrest (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2024, 10:44 AM IST

Dhoolpet Woman Ganja Peddler Anguri Bai Arrest :హైదరాబాద్ నగర శివారుల్లోని మూడు ప్రాంతాల్లో ఖరీదైన ఫామ్ హౌస్​లు, చుట్టూ ఎల్లప్పుడూ నలుగురు బౌన్సర్లు, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, కుక్కలతో ఎప్పుడూ గస్తీ. సిండికేట్ వ్యక్తులకు పుష్ప తరహాలో పార్టీలు. ఇవన్నీ విని బడా వ్యాపార వేత్త అనుకుంటే పొరబడినట్లే. ఇదంతా గంజాయి సిండికేట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ధూల్‌పేట ప్రాంతానికి అంగూరీ భాయి అలియాస్‌ అరుణా భాయి కథ. పుష్ప సినిమాను తలపించేలా గంజాయి సిండికేట్ నడుపుతూ పోలీసులకు చిక్కకుండా సిమ్ కార్డులు మారుస్తూ తప్పించుకుని తిరగుతున్న అంగూరీ భాయ్‌ ఎట్టకేలకు ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్‌ బృందానికి చిక్కింది. ఈమెపై అబ్కారీ శాఖలో ఇప్పటివరకూ 25 కేసులున్నాయి.

గంజాయి విక్రయాలు తగ్గే అవకాశం :తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌ ధూల్‌పేటలోని యతీంఖానా ప్రాంతానికి చెందిన అంగూరీ భాయి ఒకప్పుడు సాధారణ గృహిణి. కుటుంబం గుడుంబా వ్యాపారం చేసినా ఆమె ఎన్నడూ చేయిపెట్టలేదు. 2015 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధూల్‌పేటలో గుడుంబా విక్రయాలను ఆపేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. ఆ తరువాత ఈ కుటుంబానికి చెందిన కొందరు డబ్బు కోసం గంజాయి అమ్మేవారు. ఈ క్రమంలోనే అంగూరీ భాయి ఇంటి దగ్గరే ఉంటూ గంజాయి గ్రాముల్లో అమ్మకాలు ప్రారంభించింది.

ఇలా తొలిసారి 2017లో అబ్కారీ అధికారులకు చిక్కింది. 460 గ్రాముల గంజా మాత్రమే దొరకడంతో స్టేషన్‌ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత 2019 వరకూ ఈమెపై మొత్తం పది కేసులు నమోదు అయ్యాయి. అప్పటి వరకూ సాధారణ గంజాయి విక్రేతగా ఉన్న అంగూరీ భాయి కొవిడ్‌ తర్వాత గంజా దందాలో అంచెలంచెలుగా ఎదిగింది. ఈమె కుటుంబం మొత్తం ఈ దందాలో ఉండడంతో అంగూరీ భాయి చిన్నాచితకా విక్రయాలు మానేసి పెద్ద మొత్తంలో విక్రయించే స్థాయికి చేరింది.

ఒడిశా నుంచి లారీల్లో రవాణా - కోటి రూపాయల గంజాయి సీజ్

స్థానికంగా కొందరు అధికారులు సహకరించడం, చూసీచూడనట్లు వదిలేయడంతో నెట్‌వర్క్‌ను పెంచుకుంది. ఒక్క అబ్కారీ శాఖ అధికారులే ఈమెపై 25 కేసులు నమోదు చేశారు. ఇవిగాకుండా పోలీసు కేసులు ఉంటాయని వాటిపైనా ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈమె అరెస్టుతో హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలు తగ్గే అవకాశం ఉందని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారంటే ఏ స్థాయిలో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు.

ఆపరేషన్‌ ధూల్‌పేట :హైదరాబాద్‌ సహా తెలంగాణలో గంజాయికి డిమాండ్‌ పెరగడాన్ని అంగూరీ భాయి బాగా సొమ్ము చేసుకుంది. ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసే సిండికేట్‌లో ఒకరిగా మారింది. ఎప్పుడూ చుట్టూ నలుగురు బౌన్సర్ల తరహాలో అంగ రక్షకులుగా ఉంటారు. ఈ అక్రమ వ్యాపారంతో వేరు వేరు ప్రాంతాల్లో 3 ఫాంహౌజ్‌లతో పాటు కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కూడగట్టినట్లు అధికారులు చెబుతున్నారు. 6 రాష్ట్రాలకు ఈమె గంజాయి సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో పాటు ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో కొందరు రైతులకు పెట్టుబడి కింద డబ్బు ఇచ్చి గంజాయి సాగు చేయించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల గంజాయి విక్రేతలకు అంగూరీ భాయి ఇరవై లక్షల రూపాయలతో ఓ విందు ఇచ్చినట్లు సమాచారం. ధూల్‌పేటలో గంజాయి విక్రయాల నిర్మూలనకు అబ్కారీ శాఖ జులై మూడో వారంలో ‘ఆపరేషన్‌ ధూల్‌పేట’ ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్‌ ధూల్‌పేట ఇన్‌ఛార్జి, అబ్కారీ రాష్ట్ర ఎస్‌టీఎఫ్‌ సూపరింటెండెంట్‌ అంజిరెడ్డి బృందం సుమారు 143 మంది గంజాయి విక్రేతల్ని అరెస్టు చేసినా అంగూరీ భాయి మాత్రం చిక్కలేదు. సిమ్‌కార్డులు మారుస్తూ వేరు వేరు ప్రదేశాల్లో ఉంటూ తన నెట్‌వర్క్‌ను కొనసాగించింది. దాదాపు 3 నెలలు ముప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు గురువారం చిక్కింది.

బెయిల్ ఇస్తే దొరకరంతే! - పరారీలో 900మంది

పీడీ చట్టం ప్రయోగించే అవకాశం :అంగూరీ భాయి గంజాయి సామ్రాజ్యం ఎంతగా విస్తరించిందంటే ఆమె కుమారులైన సురేందర్‌ సింగ్, రాజా సింగ్, మరదళ్లు అనీత భాయి, స్వప్నా భాయి, అల్లుడు శుభంసింగ్, సొంత చెల్లెళు ఆర్తీ భాయి, చెల్లి కుమారుడు అంకిశ్‌సింగ్‌తో పాటు సమీప బంధువులు మొత్తం దాదాపు 15 మంది అందరూ మత్తు దందాలోనే ఉన్నారు. వీరందరూ అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, కుక్కలతో ఎప్పుడూ గస్తీ ఉంటుంది. కొత్త వ్యక్తులు, పోలీసులు, అబ్కారీ అధికారులు వస్తే వెంటనే గుర్తించి పరారయ్యేలా ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్ నగరంలో ఎంతో మంది గంజాయి విక్రేతలకు అంగూరీ భాయి ప్రధాన సరఫరాదారు. ఈమె అరెస్టు నేపథ్యంలో గంజాయి విక్రయాల ద్వారా సంపాదించిన ఆస్తుల లెక్కతేల్చేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ ఆస్తుల్ని జప్తు చేయడంతో పాటు అంగూరీ భాయిపై పీడీ చట్టం ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

'పుష్పా' ఎర్రచందనమే కాదు - మన శీలావతికీ దేశవ్యాప్త డిమాండ్

ABOUT THE AUTHOR

...view details