Police Advices on Loan Apps Photo Morphing Threats:ఇటీవల కాలంలో రుణయాప్ ఏజెంట్ల వేధింపులకు బలవుతున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఈ విషయమై ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉమ్మడి ప్రకాశంలోనూ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో యువత, విద్యార్థులు, మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. పూర్తిగా తిరిగి చెల్లించినా ఇంకా బాకీ ఉందంటూ ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం సైబర్ నేరగాళ్ల బరితెగింపునకు పరాకాష్ఠగా నిలుస్తోంది. దీంతో బాధితులు మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ సైబర్ దాడి నుంచి రక్షించుకునేందుకు ఓ వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన పెంచుకుంటే ఏ సందర్భంలోనైనా ఉపయోగపడుతుందని పోలీసులు చెప్తున్నారు. ఆ వివరాలు మీ కోసం.
వేధింపుల ఘటనలు
- లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు పెళ్లైన 40 రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం రూ.2000 కోసం భార్యాభర్తల ఫొటోలను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 10వ తేదీన విశాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- నంద్యాల జిల్లాలోని శ్రీశైలానికి చెందిన ఓ యువతి రూ.15,000 రుణం తీర్చే క్రమంలో వేధింపులకు గురైంది. ఈ నెల 9న శ్రీశైలంలోని శిఖరేశ్వరం నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటవీశాఖ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది.
- కనిగిరి మండలం శంఖవరానికి చెందిన 19 ఏళ్ల యువకుడు లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుని రికవరీ ఏజెంట్ల బారినపడ్డాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో రూ.1.60 లక్షల మొత్తం చెల్లించారు. అయినప్పటికీ మరికొంత చెల్లించాలని డిమాండ్ చేసి ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడంతో తనువు చాలించాడు.
'పోలవరం పూర్తయ్యేది అప్పుడే - టార్గెట్ ప్రకటించిన సీఎం చంద్రబాబు
పూర్తిగా సురక్షితం:ఈ సైట్ పేరు www.stopncii.org అంతర్జాతీయంగా నిర్వహించే ఈ వెబ్‌సైట్ పూర్తిగా భద్రమైనదని పోలీసులు అంటున్నారు. మనం అప్‌లోడ్ చేసిన ఫొటోలను డౌన్‌లోడ్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం లాంటివి ఉండవు. డిజిటల్ ఫింగర్ ప్రింట్ తరహాలో మన చిత్రంతో ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. దాని ఆధారంగా సోషల్ మీడియాలో మన ఫోటోలు అప్‌లోడ్ అయితే అధునాతన సాంకేతిక ఆధారంగా గుర్తించి క్షణాల్లో తొలగిస్తుంది. 2015లోనే అందుబాటులోకి వచ్చిన ఈ వెబ్‌సైట్ ఇప్పటివరకు అంతర్జాతీయంగా 2 లక్షల మందికి పైగా బాధితుల మార్ఫింగ్ చిత్రాలను తొలగించి వారికి వ్యక్తిగత రక్షణ కల్పించింది.