Polavaram Project DPR: పోలవరం తొలి దశకు అవసరమయ్యే పూర్తి నిధులను అంచనా వేసి ఇప్పటికే డీపీఆర్‌ను (DETAILED PROJECT REPORT) రూపొందించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, సాంకేతిక సలహామండలి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ, పెట్టుబడుల అనుమతి మండలి పోలవరం ప్రాజెక్టు నిధులకు ఆమోదముద్ర వేశాయి. ఇప్పటికే అన్ని స్థాయిలు దాటిన పోలవరం డీపీఆర్, మంత్రిమండలి ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 30 వేల 436.95 కోట్ల రూపాయలతో సిద్ధమైన డీపీఆర్‌ను కేంద్ర మంత్రిమండలి వచ్చే వారం ఆమోదించే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ నెల 27, 28వ తేదీల్లో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది.
ఇటీవల దిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించి కేంద్ర పెద్దలతో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్లారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ మాట్లాడారు. జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు వాస్తవ పరిస్థితిని వివరించారు. దీంతో తదుపరి కేంద్ర మంత్రిమండలి ముందుకు ఈ ప్రతిపాదన వెళ్లనున్నట్లు రాష్ట్ర అధికారులకు కబురు అందింది.
పీఎంఓ ఆదేశాల మేరకు ఆర్థికశాఖ ఈ ప్రతిపాదనను మంత్రిమండలి ముందు ఉంచనుంది. పోలవరం తొలి దశకు అవసరమయ్యే పూర్తి నిధులను అంచనా వేసి పోలవరం డీపీఆర్‌ను రూపొందించారు. ఇప్పటికే తొలి దశకు అవసరమయ్యే పూర్తి నిధులకు పలు స్థాయిలలో ఆమోదముద్ర వేశారు. ఇక కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.