పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను ఎప్పటికి పూర్తి చేస్తారు - పీపీఏ సమావేశంలో చర్చ Polavaram Project Authority Meeting: హైదరాబాద్‌లో సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ జరిగింది. రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి, చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌బాబు సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ప్రాజెక్టు పనుల తీరుతెన్నులపై చర్చ జరిగింది. ముఖ్యంగా డిజైన్లకు సంబంధించి పోలవరం అధికారులు షెడ్యూలు ఇవ్వగా, ఆయా తేదీలు ముందుకు జరపాలని అథారిటీ కోరింది.
డిజైన్లు ఖరారైతే తప్ప పనులు ముందుకెళ్లే ఆస్కారం లేనందున త్వరపడాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (Polavaram Project Authority) సభ్యులు స్పష్టం చేశారు. పెండింగు డిజైన్లను త్వరగా పూర్తిచేసి సమర్పించాలని ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం తరపున పోలవరం నిర్మాణ పనులు చేస్తున్న మేఘా సంస్థ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ డిజైన్ల కన్సల్టెన్సీ ఎప్పుడు పని ప్రారంభిస్తుందని ఆథారిటీ సభ్యులు ప్రశ్నించారు. పెండింగు డిజైన్లను త్వరగా పూర్తిచేసి సమర్పించాలని కోరారు.
ప్రాజెక్టులో ఎడమ, కుడి వైపుల చేసే షార్ట్ గ్రిడింగ్ పనులపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యులు ఆరా తీశారు. పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్ పనులు ఇంకా 20 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు చేయాల్సి ఉందని, జులై నాటికి ఆ పని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఇంత ఆలస్యం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. అప్రోచ్ ఛానల్ డ్రెడ్జింగ్, గ్యాలరీ నుంచి పైకి వచ్చేలా ఏర్పాటు చేసుకునే లిఫ్టులు ఇతర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది.
దేశీయ ఇంజినీరింగ్ నిపుణులతో సాధ్యం కాదు - ఇంటర్నేషనల్ డిజైన్ యూనిట్ ఏర్పాటు చేయాలి : కేంద్ర జలసంఘం
పునరావాస పనులకు కొద్ది మొత్తం నిధులు విడుదల చేస్తే ఎక్కువశాతం పనులు పూర్తిచేసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న తెలంగాణ అధికారులు పోలవరం వరదల వల్ల తెలంగాణ ముంపు ఇబ్బందిని ఎదుర్కొంటోందని ఉమ్మడి సర్వేకు పట్టుబట్టారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని ఏపీ అధికారులు సమాధానం ఇచ్చారు. ఎఫ్ఆర్ఎల్ స్థాయికి వరద వస్తే ఎక్కడ వరకు ముంపు ఏర్పడుతుందో సంబంధిత రాళ్లు ఏర్పాటు చేశామని, తెలంగాణ అధికారులు వస్తే వాటిని చూపుతామని ఏపీ అధికారులు వెల్లడించారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు తొలిదశ అంచనాల విషయం కొలిక్కి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. సుమారు 30 వేల 400 కోట్ల రూపాయల మొత్తానికి అంచనాలు సవరిస్తూ రివైజ్డ్ కాస్ట్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఇప్పటికే రాజమహేంద్రవరంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం తరలింపునకు అథారిటీలో ఉన్న 11 మంది సభ్యుల్లో 9 మంది ఆమోదం తెలిపారు. మిగిలిన సభ్యుల ఆమోదం కూడా పొందిన తరువాత గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఆ తర్వాత కార్యాలయం మారుతుంది. ఇకపై ఆథారిటీ సమావేశాలు రాజమండ్రిలోనే ఏర్పాటు చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులు? - పోలవరం నిర్మాణంలో ఏపీ తీరుపై కేంద్రం ఆగ్రహం