ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరి ఎయిమ్స్​ను నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ - మంగళగిరిలో ఎయిమ్స్​ ఆసుపత్రి

PM Narendra Modi Will Virtual Inaugurate AIIMS Hospital: మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్​ ఆసుపత్రిని ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. తక్కువ ధరల్లోనే వైద్య పరీక్షలు, అత్యాధునిక వైద్యం ఇలా సామాన్యులకు సేవలు అందిస్తోంది ఎయిమ్స్​​ ఆసుపత్రి. రోగులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలంటే వైద్య పరీక్షల బిల్లులకు భయపడే పరిస్థితి లేకుండా 40శాతం తక్కువకే ఎయిమ్స్​లో చికిత్స అందిస్తున్నారు.

PM Narendra Modi will Virtual inaugurate AIIMS Hospital
PM Narendra Modi will Virtual inaugurate AIIMS Hospital

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 7:21 AM IST

మంగళగిరి ఎయిమ్స్​ను నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ

PM Narendra Modi Will Virtual Inaugurate AIIMS Hospital: ఆ ఆసుపత్రిలో డాక్టర్ ఫీజు కేవలం పది రూపాయలే. అలాగని అల్లాటప్పా డాక్టర్లు కాదు నిపుణులైన వారే చికిత్స అందిస్తారు. కార్పొరేట్ ఆసుపత్రిని మించిన సౌకర్యాలు, తక్కువ ధరల్లోనే వైద్య పరీక్షలు, అందుబాటులో అత్యాధునిక వైద్యం ఇలా సామాన్యులకు సేవలు అందిస్తోంది మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ. పూర్తిగా కేంద్రం నిధులతో నడుస్తున్న ఈ ఆధునిక వైద్యాలయానికి వైసీపీ సర్కారు నుంచి సహకారం కొరవడింది. తాగునీరు, విద్యుత్, భూకేటాయింపుల సమస్యలను పరిష్కరించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఈ ఆసుపత్రిని జాతికి అంకితం చేయనున్నారు.

ఎయిమ్స్​ ఆసుపత్రిని వర్చువల్​గా ప్రారంభించనున్న ప్రధానమంత్రి మోదీ - సభ ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

తక్కువ ఖర్చుతో వైద్య సేవలు: విభజన చట్టం ప్రకారం గుంటూరు జిల్లా మంగళగిరిలో 183 ఎకరాల విస్తీర్ణంలో ఎయిమ్స్ ఆసుపత్రి ఏర్పాటైంది. అధునాతన ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణం కోసం కేంద్రం రూ.1618 కోట్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలంతో పాటు కొన్ని మౌలిక వసతులు కల్పించింది. 2015 డిసెంబర్ 19న ఈ ఆసుపత్రికి శంకుస్థాపన జరిగింది. 2019 మార్చి 12న ఓపీ సేవలు మొదలయ్యాయి. తొలిరోజు 44మంది రోగులతో ప్రారంభం కాగా ఇప్పుడు రోజుకు 2,500మంది వస్తున్నారు. ఐదు సంవత్సరాలలో 15లక్షల మందికి పైగా వైద్య సేవలు పొందారు. 2020 జూన్ 11న ఇన్ పేషంట్ సేవలు మొదలవ్వగా ఇప్పటి వరకు 21వేల మందికి పైగా చికిత్స తీసుకున్నారు. ఎయిమ్స్‌లో ఓపీ ఫీజు కేవలం 10 రూపాయలే. రోగులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలంటే వైద్య పరీక్షల బిల్లులకు భయపడే పరిస్థితి. కానీ వివిధ రకాల ఎక్స్‌రేలు, స్కానింగ్‌లు బైట ఆసుపత్రులతో పోలిస్తే 40శాతం తక్కువకే ఎయిమ్స్​లో అందిస్తారు. ఇప్పటికే 5వేలకు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించారు.

కోవిడ్ సమయంలో చాలా మంది వైద్యం పొందారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం, సీజీహెచ్ఎస్ నగదు రహిత సదుపాయం అమలు చేస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సంస్థను ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. ఈ ఆసుపత్రి ప్రస్తుతం పూర్తిగా పని చేస్తోంది. అందువల్లే ప్రధాని మోదీ దీన్ని జాతికి అంకితం చేస్తున్నారు. ఈ ఆసుపత్రిని స్థానికులతో పాటు పక్క రాష్ట్రాల వారికి కూడా సంపూర్ణ సేవలు అందించడం కోసం స్థాపించారు. భవిష్యత్తులో అన్ని సేవలు అందరికీ అందుతాయి. అంకితభావం కలిగిన వైద్య నిపుణులు అలాగే అన్ని అర్హతలు కలిగిన వైద్యులు ఈ ఆసుపత్రిలో ఉన్నారు. ప్రస్తుతం 41 డిపార్ట్‌మెంట్లు పని చేస్తున్నాయి.

పేదలను అభివృద్ధిలోకి తీసుకురావడమే 'వికసిత భారత్' సంకల్పం: కేంద్రమంత్రి మాండవీయ

చవకగా నాణ్యమైన వైద్యం: ఇక్కడ పనిచేసే వైద్యులకు ఇదే క్యాంపస్‌లో నివాసాలు ఏర్పాటు చేశారు. వారికి బైట ప్రాక్టీస్‌కు అవకాశం ఉండదు. తద్వారా రోగులకు మంచి వైద్యం అందుతుంది. అనవసర టెస్టులు, మందులు రాయరు. దీని వల్ల ఖర్చు తగ్గుతుంది. ఇతర వైద్య సేవలు తక్కువ ధరల్లో ఉంటాయి . కాబట్టి పేదలకు నాణ్యమైన వైద్యం చవకగా అందుతుంది. చాలా మంది బయట ప్రైవేటు ఆస్పత్రులు తిరిగి నయం కాక ఇక్కడకు వస్తుంటారు. క్యాన్సర్, మూత్రపిండాలు, ఉదరకోశ వ్యాధులకు ఇక్కడ అత్యున్నత వైద్యం అందుతోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. తెలంగాణ నుంచి వచ్చి సేవలు పొందుతున్నారు. రోగి సమస్యకు మూలాల్ని గుర్తించి సరైన వైద్యం అందించడం వల్లే తక్కువ సమయంలో మంచి పేరు వచ్చింది. ఎయిమ్స్‌లో వైద్యంతో పాటు శిక్షణ, పరిశోధనలు జరుగుతున్నాయి. వైద్య కళాశాలలో 125 ఎంబీబీఎస్ సీట్లు, పీజీ విభాగంలో 40 సీట్లు ఉన్నాయి. నర్సింగ్ కళాశాల 50 సీట్లతో నడుస్తోంది. వీటిని 100కు పెంచటంతో పాటు పారామెడికల్ కోర్సులు త్వరలో ప్రారంభించనున్నారు.

వర్చువల్‌గా ప్రారంభించనున్న మోదీ: ప్రస్తుతం ఎయిమ్స్ నిర్మాణ పనులు 98 శాతం పూర్తైనట్లు అధికారులు తెలిపారు. అంతర్గతంగా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఆసుపత్రిలో ప్రస్తుతం 750 ఇన్ పేషంట్ బెడ్లు ఉన్నాయి. ఇవి పూర్తైతే 960 మంది రోగులకు చికిత్స అందించవచ్చు. కేంద్రం కోట్లు వెచ్చించి ఆసుపత్రి నిర్మిస్తే దానికి తాగునీటి వసతి, కరెంటు సౌకర్యం కల్పించలేని దుస్థితిలో రాష్ట్రం ప్రభుత్వం ఉంది. ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్‌కు పైపులైన్‌ ద్వారా నీరిచ్చేందుకు చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులకు 2022 జూలైలో టెండర్లు పిలిచారు. 2023 అక్టోబరుకు పూర్తి చేయాల్సి ఉన్నా అది కాలేదు. సరిపడా నీరు లేక ఇన్ పేషంట్లను చేర్చుకోలేని పరిస్థితి. 750 పడకలుండగా అందులో 65శాతం మందినే ప్రస్తుతం చేర్చుకుంటున్నారు. సీఎస్‌తో ఎయిమ్స్ అధికారులు సమావేశమై పరిస్థితిని వివరించినా పరిష్కారం కాలేదు. ఎయిమ్స్‌కు రవాణా సౌకర్యం కల్పించటంలోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ హయాంలో ఎయిమ్స్ పనులు చురుగ్గా జరగ్గా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నేడు వర్చువల్‌గా ప్రధాని మోదీ ఎయిమ్స్‌ను ప్రారంభించనుండగా కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 25వేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, కిషన్ రెడ్డి, భారతీ ప్రవీణ్ పరివార్, మంత్రి విడదల రజని ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

రెండేళ్ల బాలిక బ్రెయిన్​ డెడ్- అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ

ABOUT THE AUTHOR

...view details