Solar Power In Kuppam:చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో త్వరలో సౌరకాంతులు వెదజల్లనున్నాయి. పీఎం సూర్యఘర్ పథకం ఇక్కడ ప్రత్యేకత సంతరించుకోనుంది. ఇక్కడి గృహవిద్యుత్తు కనెక్షన్లను సౌర వ్యవస్థతో అనుసంధానించడానికి చేపట్టనున్న పైలట్ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుంది. నియోజకవర్గం పరిధిలో 50 వేల గృహ కనెక్షన్లకు సౌరవిద్యుత్తు ఏర్పాటు లక్ష్యంగా అధికారులు చర్యలు ప్రారంభించారు. కుప్పం నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ (రెస్కో) కి 1.30 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహవినియోగ కనెక్షన్లు 77 వేలు ఉండగా వాటిలో సరాసరి 50 వేల కనెక్షన్లు సౌర విద్యుత్తు అందించేందుకు ఎస్పీడీసీఎల్, రెస్కో అధికారులు గుర్తించారు. ఒకే ఇంటికి ఒకట్రెండు విద్యుత్తు సర్వీసులు ఉన్నందున మొత్తం 50 వేల విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు తేలింది. ఒక్కొక్క ఇంటి విస్తీర్ణం, ఎంత విద్యుత్తు అవసరమో సర్వేలో అంచనా వేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యవసాయ సర్వీసులను సైతం సౌర విద్యుత్తు విభాగంలోకి మార్చే ప్రక్రియను చేపట్టనున్నారు. సౌర విద్యుత్తును ఇళ్లకు వినియోగించిన తరువాత మిగులు విద్యుత్తును మళ్లీ ప్రభుత్వానికే విక్రయించేలా నెట్ మీటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
సంపూర్ణ రాయితీ: పీఎం సూర్యఘర్‌లో భాగంగా కేంద్రం 60 శాతం రాయితీ ఇవ్వగా, కుప్పం ప్రజలకు పూర్తిస్థాయిలో సౌర విద్యుత్తు అందించాలన్న ముఖ్యోద్దేశంతో మిగిలిన 40 శాతం సైతం రాష్ట్ర ప్రభుత్వం భరించి పథకాన్ని వర్తింపజేయనుంది. నియోజకవర్గంలో సంపూర్ణంగా సౌర విద్యుత్తు ఏర్పాటుకు దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకు ఖర్చుకానుంది. ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సౌర వెలుగులు రానుండటంతో ప్రజలు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. జనవరి మొదటి వారంలో కుప్పం పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం మండల పరిధి బిరుదనపల్లెలో పథకాన్ని ప్రారంభించే అవకాశముంది.