New Development Bank Road Project In Nellore: పనులు దక్కించుకున్నది ఒకరు. చేసేది మరొకరు. పోనీ వాళ్లు అయినా సమయానికి పూర్తి చేశారా అంటే అదీ లేదు. ఐదేళ్ల క్రితం మొదలైన రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా దగదర్తి-బుచ్చిరెడ్డిపాళెం మధ్య 16 గ్రామాల ప్రజలు రోడ్డు పనులు పూర్తికాక అవస్థలు పడుతున్నారు. తరచూ రోడ్ల మీద ప్రయాణించే ప్రయాణికులు వీటి వల్ల పలు ప్రమాదాలకు గురి అవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర వహించడం కారణంగా తమకు ఈ పరిస్థితి వచ్చిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోని కావలి, నెల్లూరు, గూడూరు డివిజన్లలో ఆరు ప్రధాన రహదారులను రెండు వరుసలుగా విస్తరించడానికి మూడేళ్ల క్రితం టెండర్లు పిలిచారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో నిర్మాణం చేస్తున్నారు. రాష్ట్ర ప్రధాన రహదారుల విస్తరణ, పటిష్టం చేసేందుకు ప్యాకేజీ టెండర్లను భవానీ కనస్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ ప్యాకేజి కింద వ్యయం 87.58 కోట్ల రూపాయలు కాగా దగదర్తి-బుచ్చిరెడ్డిపాళెం రోడ్డుకు 38 కోట్లు నిధులు కేటాయించారు. ఈ నిధుల్లో 70 శాతం ఎన్డీబీ, 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఒప్పందం ప్రకారం 24 నెలల్లో పనులు పూర్తి చేయాలి. కానీ ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు సాగుతుంది.
అడుగుకో గొయ్యి.. గజానికో గుంత.. 'మా రహదారులకు దిక్కెవరు..?'
గుత్తేదారు నిర్లక్ష్యం: టెండరు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ పనులను ఉప గుత్తేదారుకు అప్పగించింది. గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఉప గుత్తేదారు పనులను అసంపూర్తిగా వదిలివేశారు. కనీసం చేసినంతవరకైనా సక్రమంగా చేయలేదు. రోడ్లన్నీ అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులపై కట్టిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.దగదర్తి నుంచి బుచ్చిరెడ్డిపాళెం వరకు రోడ్డు నిర్మాణంలో రోలింగ్ సరిగా లేక వర్షాలకు భారీ గోతులు ఏర్పడ్డాయి. రాత్రి సమయాల్లో ప్రజలు ఈ రోడ్డుపై వెళ్లలేక పోతున్నారు. చేసిన పనులన్నీ దెబ్బతిని కంకర బయటకు వచ్చి వాహనాలు పడిపోతున్నాయి.