ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణమ్మ మహోగ్రరూపం - విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - క్షణం క్షణం కమ్మేస్తోన్న వరద - Krishna River Floods - KRISHNA RIVER FLOODS

Krishna Floods in Lanka Villages : చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద పోటెత్తడంతో నదీ తీర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రకాశం బ్యారేజీకి 11.4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. కరకట్ట లోపల గ్రామాలు నీటిలో చిక్కుకోవడంతో అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్కడే ఉన్నవారికి పడవల ద్వారా ఆహారం సరఫరా చేశారు. భారీ వరదతో కరకట్ట బలహీనంగా ఉన్నచోట్ల గండి పడుతుందనే భయం తీర ప్రాంత ప్రజలు, అధికారుల్ని కలవరపెడుతోంది. గతంలో ఎన్నడూ ఇలాంటిది చూడలేదని కరకట్ట పైఅంచు తాకుతూ ఇలా ప్రవహించడం ఇదే తొలిసారని చెబుతున్నారు.

Krishna Floods in Lanka Villages
Krishna Floods in Lanka Villages (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 8:56 AM IST

Prakasam Barrage Flood Water : ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఆదివారం రాత్రి నుంచి ప్రమాదకర స్థాయికి చేరింది. సోమవారం ఉదయానికి లంక గ్రామాలను వరద చుట్టుముట్టింది. కృష్ణానదికి ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతుండటంతో బ్యారేజీ ఎగువన హరిశ్చంద్రాపురం, పెదలంక, తాళ్లాయపాలెం లంక, ఉద్ధండరాయునిపాలెం లంక, తాడేపల్లి సుందరయ్యనగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది కుడి కరకట్ట లోపల ఉన్న లంక గ్రామాలన్నీ నీటమునిగాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొమ్మవానిపాలెం, అన్నవరపులంక, కొత్తూరులంక, బాపట్ల జిల్లాలోని చిలుమూరులంక, ఈపూరులంక, సుగ్గనలంక, పెదలంక, పెసర్లంక, ఆవులవారిపాలెం, జువ్వలపాలెం గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. గాజుల్లంక, పోతార్లంక, రావిలంక, కృష్ణాపురం, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, చింతమోటు, తడికలపూడి, పల్లెపాలెం పూర్తిగా వరద ముంపులో చిక్కుకున్నాయి.

Krishna River Floods in AP 2024 :లంక గ్రామాలకు పూర్తిగా రాకపోకలు స్తంభించడం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అధికార యంత్రాంగం సోమవారం ఉదయాన్నే బోట్ల ద్వారా సహాయ బృందాలను అక్కడికి పంపి పరిస్థితిని అంచనా వేసింది. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, పిల్లలను ముందస్తుగా ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ల ద్వారా ఒడ్డుకు చేర్చారు. మిగిలినవారికి నిత్యావసరాలు, తాగునీరు, భోజనాలను సరఫరా చేశారు. లంక గ్రామాల్లో ఎత్తున ఉన్న ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ఎత్తయిన ప్రదేశాలకు పశువులను తరలించి వారు అక్కడే తలదాచుకుంటున్నారు.

"ఇళ్లలో ఉన్న వస్తువలన్ని పాడైపోయాయి. వరద ఇంత రాదని అనుకున్నాం. అధికారులు వచ్చి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని చెప్పారు. కట్టుబట్టలతో బయటకు వచ్చాం. పంటలు నీట మనిగాయి. పంటలు నీటిలో నాని కుళ్లిపోతున్నాయి. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. మమల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాం." - బాధితులు

వేల కోట్ల పంట నష్టం : కృష్ణానది కరకట్ట లోపల భూములు అత్యంత సారవంతమైనవి కావడంతో రైతులు పసుపు, కంద, అరటి, తమలపాకులు, దొండ పందిళ్లు, కూరగాయలు సాగుచేశారు. అరటి చెట్లు కొనలు కనిపిస్తుండగా మిగిలిన పంటలన్నీ పూర్తిగా నీటమునిగిపోయాయి. కనుచూపు మేర నీరు కనిపిస్తుండటంతో ఒక్క ఎకరా కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. పల్నాడు జిల్లా వైకుంఠపురం నుంచి బాపట్ల జిల్లా పెనుమూడి వరకు కరకట్ట లోపల పంటలన్నీ దెబ్బతిన్నాయి. దీంతో వేల కోట్ల పంట నష్టం వాటిల్లింది. కృష్ణా కరకట్ట లోపల ఉన్నవారు కట్టుబట్టలతో బయటికి వచ్చేశారు.

కృష్ణానదికి వరద నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ దుగ్గిరాల, కొల్లిపర మండలాల పరిధిలో పర్యటించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ బాపట్ల, గుంటూరు జిల్లా పరిధిలో లంక గ్రామాల వద్ద వరద ఉద్ధృతిని పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా 90,000ల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లే అవకాశముందని అన్నారు. లంక గ్రామాల ప్రజలు యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సోమవారం నాడు పూర్తిగా కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలో పర్యటించారు. కరకట్ట వెంబడి ఉంటూ కట్టను బలోపేతం చేసే పనులను సమీక్షించారు. గుంటూరు, బాపట్ల జిల్లా యంత్రాంగం పడవలు, రబ్బరు బోట్ల ద్వారా లంక గ్రామాలకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నవారికి వైద్యం అందించారు.

ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు పంపిణీ :మత్స్యశాఖ 120 నాటు పడవలు, మత్స్యకారులను సిద్ధం చేసి సేవలు అందించారు. లంక గ్రామాల్లో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అక్కడున్న వారికి ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు పంపిణీ చేశారు. బొమ్మవానిపాలెంలో 600 క్వింటాళ్ల మొక్కజొన్నలను పడవల ద్వారా ఒడ్డుకు చేర్చారు. నీటి ప్రవాహం సముద్రంలోకి సజావుగా వెళ్లడానికి అమావాస్య అడ్డంకిగా మారింది. సముద్రం నుంచి పోటు ఎక్కువగా ఉండటంతో వరద సజావుగా సముద్రంలోకి వెళ్లడానికి ఇబ్బంది కలుగుతోంది.

వరద బాధితులకు పటిష్ట సహాయ చర్యలు - డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ - first time used drones in ap

ఏపీలో వర్ష బీభత్సం - 19 మంది మృతి - ఇద్దరు గల్లంతు: ప్రభుత్వం వెల్లడి - Heavy Rains and Floods in AP

ABOUT THE AUTHOR

...view details