People Suffer Due to Flood Effect in Joint Guntur District :కృష్ణానది వరద పల్నాడు జిల్లా వాసులను ముప్పతిప్పలు పెడుతోంది. ఎగువున కురుస్తున్న వానలకు నదీ పరివాహక ప్రాంతంలో వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. కరకట్టలు బలహీనపడటంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. లంక గ్రామాలను వరద ముంచెత్తడంతో వారందరినీ ఖాళీ చేయించి పునరావాస శిబిరాలకు తరలించారు. వర్షం ముప్పు పూర్తిగా తొలగని నేపథ్యంలో నదీతీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు :కృష్ణమ్మ వరద ఉద్ధృతికి గుంటూరు జిల్లాలోని హరిశ్చందపురం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమరావతి విజయవాడ ప్రధాన మార్గంలో ఉన్న ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. గ్రామంలో ఉన్న ఇళ్లను వరద ముంచెత్తింది. అధికారులు కూడా గ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గ్రామస్థులు డాబాలపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అమరావతి-విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
వరద ఉద్ధృతికి ఉమ్మడి గుంటూరు జిల్లా అతలాకుతలం - లంక గ్రామాలు జలమయం - Flood Effect in Guntur District
ఊళ్లకు ఊళ్లే నీటమునక :పల్నాడు జిల్లాలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ఊళ్లను ముంచింది. అమరావతి మండలంలోని నదీతీర గ్రామాల్లో వరద పోటెత్తింది. పెదమద్దూరు, వైకుంఠపురం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం నుంచి ఈ రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మేళ్లవాగు, నక్కవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వేలాది ఎకరాలు చెరువుల్లా మారాయి. పొలాలు ఉన్నాయన్న ఆనవాళ్లు కనుచూపుమేరలో కనిపించకుండా ఎనిమిది అడుగుల మేర నీరు ముంచెత్తింది. ఈ రెండు ఊళ్లల్లో 6 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం స్థానికంగానే ఉంటూ ఎప్పటికప్పుడు సహాయకచర్యలను పర్యవేక్షించారు. కరకట్ట ప్రాంతంలో వరద ఉద్ధృతి దృష్ట్యా గ్రామస్థులందరినీ పునరావాస శిబిరాలకు తరలివెళ్లేలా చర్యలు తీసుకున్నారు.