People Problems with CM Jagan Siddam Sabha: జగన్ సిద్ధం సభలతో ప్రజలకు అగచాట్లు తప్పడం లేదు. రాప్తాడు సభ కోసం ఆర్టీసీ 3వేలకు పైగా బస్సులను కేటాయించింది. రాయలసీమతో పాటు ఒంగోలు, గుంటూరు ప్రాంతాల నుంచి కూడా బస్సుల్ని తరలించడంతో బస్సుల్లేక ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. చిన్నారులు, వృద్ధులతో గంటలకొద్దీ నిరీక్షించినా బస్సుల జాడ లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. తిరుమల శ్రీవారి భక్తులకు సైతం అవస్థలు తప్పలేదు. మరోవైపు సీఎం సభకు వచ్చిన వారికి బస్సుల్లోనే డబ్బు, మద్యం పంపిణీ చేశారు. సభా ప్రాంగణంలోనే పోలీసుల ఎదుటే మందుబాబులు మద్యం సేవించి చిందులేశారు.
నిబంధనలకు విరుద్దంగా రాప్తాడులో జగన్ సభ- టీడీపీ సభలకు అనేక ఆంక్షలు : అచ్చెన్నాయుడు
ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న 'సిద్ధం' సభలతో ప్రజలకు నరకయాతన తప్పడం లేదు. రాప్తాడు సభ కోసం ఆర్టీసీ 3వేలకు పైగా బస్సులను కేటాయించడంతో బస్టాండ్‌లు బోసిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం బస్టాండ్‌లో ఉదయం నుంచి ప్రయాణికులు గంటల తరబడి వేచిచూసి ఎప్పటికీ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చేసేదిలేక ఆటోల్లో గమ్యస్థానాలకు వెళ్లారు.
కదిరిలో ప్రయాణికులు గంటలపాటు బస్సుల కోసం నిరీక్షించాల్సి వచ్చింది. చంటి పిల్లలు, వృద్ధులు బాగా ఇబ్బందిపడ్డారు. 110 బస్సులున్న కదిరి డిపోలో 72 బస్సులను సీఎం సభకు తరలించారు. ఫలితంగా తగినన్ని బస్సులు లేక వందల మంది ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు.
సత్యసాయి జిల్లా మడకశిరలోనూ బస్సుల్లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోల్లో గమ్యస్థానాలకు వెళ్లారు. రద్దీతో కర్ణాటక బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సత్యసాయి జిల్లా మామిళ్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై భారీ వాహనాలను దారి మళ్లించారు. ఫలితంగా హైదరాబాద్ వెపు వెళ్లే వాహనాలకు 100 కిలోమీటర్ల దూరం పెరిగింది. ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
సీఎం సభతో సామాన్యులకు తప్పని తిప్పలు - బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు
దీంతో పాటు 'సిద్ధం' బహిరంగ సభ కోసం 20 కిలోమీటర్ల దూరంలోని మామిళ్లపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై పోలీసులు సరుకు రవాణా వాహనాలను నిలిపివేశారు. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలోనే వాహనాలను నిలిపివేయడంతో డ్రైవర్లు నానా అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం భోజనం లభించని అటవీ ప్రాంతంలో వాహనాలు నిలిపివేస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేని ప్రాంతంలో ముందస్తు సూచన లేకుండా అర్ధాంతరంగా వాహనాలు నిలిపివేయటంపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి సభ ఉన్నంతమాత్రాన జాతీయ రహదారిలో వాహనాలు నిలిపివేసే హక్కు ఎవరిచ్చారని విమర్శలు గుప్పించారు.
కర్నూలు బస్టాండ్‌లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి వేచిచూసి చివరికి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. నంద్యాల, ఆదోనిలోనూ ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. బస్టాండ్లు, రోడ్లపై గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. ప్రభుత్వ తీరుతో విసుగెత్తిన ప్రజలు ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీ నేతలపై మండిపడ్డారు.