Tiger Roaming In East Godavari District:రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పులుల సంచారం ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలోని ఆవాసాలపై పులుల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచరిస్తుందనే అనుమానాలు అందర్నీ తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గతంలోనూ ఈ ప్రదేశంలో ఓ పులి కొద్ది రోజులు సంచరించింది. మళ్లీ ఇన్నాళ్లకు మరో పులి ఇక్కడికి రావడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. పశువుపై దాడి చేసిందన్న విషయం తెలిసి అటవీ అధికారులు సైతం పులి కోసం గాలిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం - భయాందోళనలో స్థానికులు
ప్రజలందరి గుండెల్లో గుబులు: ప్రత్తిపాడు మండలం ఉపప్రణాళిక మన్యంలోకి పులి వచ్చిందనే వార్త ఆదివారం ప్రజలందరి గుండెల్లో గుబులు పుట్టించింది. బాపన్నధార పరిసర ప్రాంతంల్లో ఓ క్రూరమృగం చేతిలో పశువు బలైనట్లు అక్కడి స్థానికులు అందించిన సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమైంది. బాపన్నధార, ధారపల్లి, బురదకోట పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు ఆదివారం గాలింపు చర్యలు చేపట్టారని స్థానికులు పేర్కొన్నారు. పులి వచ్చిందనే సమాచారంతో ప్రత్తిపాడు పోలీసులు ఉపప్రణాళిక మన్యానికి వెళ్లారు. పులి రాక గురించి కిత్తమూరిపేట, పెద్దిపాలెం, బురదకోట పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.