తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : May 28, 2024, 10:27 AM IST

ETV Bharat / state

అసంపూర్తిగా వైకుంఠధామాలు - తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు - Vaikunta Dhamam Incomplete Works

Vaikunta Dhamam Incomplete Works : ప్రస్తుతం ఉన్న ఒత్తిడి లోకంలో 60 నుంచి 70 ఏళ్లు జీవించడమే గగనంగా మారుతోంది. పోయిన తర్వాతైనా ప్రశాంతంగా ఉండాలి అని ప్రతి ఒక్కరి నోట వింటుంటాం. ఈ క్రమంలో గత ప్రభుత్వం వైకుంఠధామాలను సుందరంగా తీర్చిదిద్దాలని కోట్లు వెచ్చించి శ్రీకారం చుట్టింది. కొన్ని చోట్ల ఈ ప్రయోగం విజయం సాధించినా చాలా చోట్ల పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వైకుంఠధామాలు కొన్ని పునాదుల స్థాయిలో నిలిచిపోతే మరి కొన్నిగదుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన వద్ద ఆగిపోయాయి. వసతులు లేక వైకుంఠధామాలకు వచ్చిన ప్రజలు నానా అవస్థులు పడుతున్నారు.

Lack of Facilities in Vaikunta Dhamam
BharatVaikunta Dhamam Incomplete Work (ETV Bharat)

అసంపూర్తిగా వైకుంఠధామాలు - తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు (ETV Bharat)

Lack of Facilities in Vaikunta Dhamam : ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ మినహా అన్ని జిల్లాల్లో వైకుంఠధామాల ప్రాజెక్టు సతికిలపడిందనే చెప్పాలి. స్మశానవాటికలో తగిన వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా నీటివసతి లేక అక్కడికి వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలంలో 29 పంచాయతీలకుగాను ఉపాధి హామీలో భాగంగా 11, పంచాయతీ రాజ్‌ నిధుల ద్వారా 18 వైకుంఠధామాలు నిర్మించారు. వెల్పుగొండలో 8 ఏళ్ల క్రితం వైకుంఠధామం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

దాదాపు పూర్తి దశకు వచ్చిన సమయంలో చిన్న చిన్న పనులను చేయక వదిలేశారు. ఈ కారణంగా పొదలు పెరిగిపోగా నీటి వసతి కోసం బోరు వేసినా మోటారు బిగించలేదు. అధికారులకు విన్నవించినా సమస్యను పరిష్కరించడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టేక్మాల్‌ మండల పరిధిలోని ధనూర శివారులో వైకుంఠధామాన్ని గ్రామానికి దూరంగా నిర్మించడంతో వినియోగానికి అసౌకర్యంగా ఉంది. దాదాయిపల్లి శివారులోని గచ్చుకుంట శిఖంలో నిర్మించగా అక్కడ ప్రతి వర్షాకాలంలో కుంట నిండిపోతోంది.

షెడ్లు, నీటి వసతి లేక :ఎల్లంపల్లిలో కొత్తగా నిర్మించిన వైకుంఠధామం దూరం ఎక్కువగా ఉండటంతో గ్రామస్థులు దానిని వినియోగించడం లేదు. దీంతో ఎండ, వానాకాలాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. హసన్‌మహ్మద్‌పల్లి తండా శివారులో నిర్మించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు వినియోగించలేదు. సూపంపల్లిలో గుట్ట ప్రాంతంలో ఉండటంతో నిరుపయోగంగా మారింది. బొడగట్టు గ్రామ శివారులో నీటి వసతి లేక ఇబ్బందులు తప్పడం లేదు. సంగారెడ్డి జిల్లాలో వైకుంఠధామాలు అసంపూర్తిగా ఉండటంతో వాటిని వినియోగించడంలేదు. గతం నుంచి ఉపయోగిస్తున్న ఖాళీ స్థలాలనే వాడుతున్నారు.

కనీసం వచ్చిన వారు నిల్చోడానికి షెడ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రధానంగా వేసవికాలంలో వేడిగాలులకు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో ప్రభుత్వం భూములు, వైకుంఠధామాలు ఆక్రమణకు గురవుతున్నాయి. కొన్ని చోట్ల వైకుంఠధామాలను ఆక్రమించి, వాటి మీదుగా స్థిరాస్తి వ్యాపారులు దర్జాగా దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. దుబ్బాక పురపాలికలోని లచ్చపేటలో నిర్మించిన వైకుంఠధామం పనులు అసంపూర్తిగా మిగిపోయాయి.

'ఏ ప్రభుత్వం వచ్చినా స్మశానవాటికను పట్టించుకోవడం లేదు. రాజకీయ నాయకులు వైకుంఠధామాలను అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు కానీ అది ఆచరణలోకి అయితే రావడం లేదు. జనాభాకు అనుగుణంగా మా గ్రామంలో స్మశానవాటిక లేదు. స్మశానవాటికలో పిచ్చి మొక్కలు చాలా ఉన్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలు స్నానాలు చేయడానికి ప్రత్యేక గదులు లేవు. పారిశుద్ధ్యం కరవు అయింది. రోడ్డు సౌకర్యాలు కూడా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు'- స్థానికులు

వైకుంఠధామాల నిర్మాణం పూర్తయ్యేదెప్పుడు?

ABOUT THE AUTHOR

...view details